‘చీలిక కారణంగా భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భూకంపాలు, సునామీల ముప్పు పొంచి ఉంది. అది ఎప్పుడన్నదీ చెప్పలేం. చీలిక భాగం తీరానికి వంద కి.మీ. దూరంలోనే ఉన్న నేపథ్యంలో ముప్పు తీవ్రత ఎక్కువని చెప్పకతప్పదు’ …ఇదీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ కేఎస్ కృష్ణ అభిప్రాయం. ఈ అభిప్రాయం ఈనాడు పత్రికలో ప్రచురితమైంది.
‘తీరంలో చీలిక…’ శీర్షికతో ఈనాడులో ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించిన ఈ కథనం వెనుక కుట్ర కథ ఏమైనా ఉందా? అంటే…‘తీసి పారాయలేం’ అనే జవాబు వస్తోంది. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించినప్పటి నుంచి ఎల్లో మీడియా ఏ విధంగా కథనాలను ప్రచురిస్తున్నదో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం పరిశోధకుడి అభిప్రాయం ఎవరిని బెదిరించడానికి? ఈ కథనం ఎవరి ప్రయోజనాల కోసం?
తాజాగా ఇప్పుడే ఈ కథనం ఎందుకు ప్రచురించారంటే…మూడు రాజధానులతో పాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్లిన నేపథ్యంలో…అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చేసేందుకు ఈనాడు తన చిట్టచివరి ప్రయత్నమే ఇదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ డేట్‌లైన్‌తో ఈ కథనం రావడం యాదృశ్చికం ఎంత మాత్రం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథనాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఈనాడు కుట్రకోణాలు బయటపడుతాయి. మనదేశ తూర్పుతీరానికి వంద కి.మీ. దూరంలో బంగాళా ఖాతంలో 300 కి.మీ. పొడవున లోతైన చీలిక (ఫాల్ట్‌లైన్) ఉన్నట్లు సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్.ఐ.ఒ.), హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారని రాసుకొచ్చారు.
కానీ ఈ కథనం వెనుక కుట్ర కోణాన్ని ఛేదించడానికి కే్ంద్రీయ విద్యాలయ పరిశోధకులు, పరిశోధాత్మక జర్నలిస్టులో అవసరం లేదు. కామన్‌సెన్స్ ఉన్న సామాన్య జనం రామోజీ అక్షరం వెనుక ఉన్న దురుద్దేశాలను ఇట్టే పసిగడుతారు.
ఈ కథనం ముఖ్య సారాంశం, రామోజీరావు కుట్ర కోణం చివరికి వెళ్లే సరికి స్పష్టంగా బయటపడుతుంది. ఆ వాక్యాలేంటో చదువుదామా?
‘విశాఖపై ప్రభావం.. సముద్రగర్భంలో చీలిక ఏర్పడినప్పుడు తీరం వైపు భూభాగం కుంగిపోయింది. అత్యధికంగా 900 మీటర్ల వరకు కుంగినట్లు ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశాఖ తీరానికి సమీపంలో కుంగుబాటు ఎక్కువగా ఉందని, దాని పర్యవసానాలు నగరంపై పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు’…ఇదీ అసలు సంగతన్న మాట.
ఈ కథనం ద్వారా రామోజీ చెబుతున్న నీతి, చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే…అయ్యా ఎగ్జిక్యూటివ్ రాజధానిని అమరావతిలో ఉం డడమే శ్రేయస్కరం. ఒకవేళ మా హెచ్చరికలను భేఖాతరు చేసి…విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తే భూకంపాలు, సునామీలతో సర్వనాశనమై పోతారని చెప్పకనే చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం పరిశోధకులు రాత్రింబవళ్లు శ్రమించి కనుగొప్ప గొప్ప ఫలితాలను తెలంగాణ ఎడిషన్‌లో ప్రచురించక పోవడం గమనార్హం.
ఈ కథనంపై పలువరు రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానికి అనుకూలం కాని విశాఖ…సామాన్య ప్రజల జీవనానికి మాత్రం ఏ విధంగా యోగ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. తీరంలో చీలిక కథనాన్ని బట్టి ఉత్తరాంధ్ర మొత్తం ప్రమాదకర పరిస్థితిలో ఉందని అర్థమవుతోందని, మరి ఆ ప్రాంత ప్రజల్ని ఎక్కడికి తరలిస్తే బాగుంటుందో కూడా చెబితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా తీరం ఒడ్డునే ఉన్న విశాఖను అమరావతికి తరలిస్తే అప్పుడు జనం సురక్షితంగా ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు. పదేపదే అబద్ధాలు రాసే ఈనాడు…ఒకవేళ నిజాలు రాసినా నమ్మలేని పరిస్థితి వచ్చిందనే వాళ్లు లేకపోలేదు.