నోటికొచ్చినట్టు మాట్లాడితే, చేతికొచ్చినట్టు టైప్ చేసి సోషల్ మీడియాలో పెడితే.. చూస్తూ ఊరుకునే కాలం కాదిది. నచ్చకపోతే మనకెందుకులే అని పోయే కాలం అసలే కాదు. సోషల్ మీడియాలో వేటాడీ, వెంటాడి మరీ కామెంట్లతో హింసించే మనుషులున్నారిప్పుడు. ఎరక్కపోయి అలా విమర్శకులకు బుక్కయ్యారు జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రేష్మి. రోజుల వ్యవధిలోనే అనుచిత వ్యాఖ్యలు చేసి ఇద్దరూ అడ్డంగా ఇరుక్కుపోయారు.
గతంలో ఇలాంటి గుణపాఠాలు చాలానే ఉన్నా కూడా మరోసారి రెచ్చిపోయారు, జనం చేతిలో తిట్లుతిన్నాక కానీ వీరికి నొప్పి తెలియలేదు. అందరి అకౌంట్లు బ్లాక్ చేసి, సమాజంలో ఇంతమంది మూర్ఖులున్నారా అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి తమ ఇగో శాటిస్ఫై చేసుకున్నారు. ఈ అందాల ముద్దుగుమ్మల్నిద్దర్నీ తిట్టించిన ఆ కామన్ పాయింట్ మాత్రం కరోనా కావడం విశేషం.
ఆమధ్య ఓ షాపు ఓపెనింగ్ కి వెళ్లింది రష్మి. కరోనా భయం ఉన్న ఈరోజుల్లో అసలు ప్రమోషన్ కార్యక్రమాలేంటని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తే, అది పాత అపాయింట్ మెంట్ అని చెప్పిన రష్మి, అసలు జనాలెందుకు అంతమంది వచ్చారు, జనాలకే బుద్ధిలేదంటూ సీరియస్ అయింది. అసలు రష్మి రాకుండా ఉంటే.. అక్కడ అంతమంది జనాలు గుమిగూడేవారు కాదు కదా. ఇక్కడ విజ్ఞత ఉండాల్సింది ఎవరికి, జనాలకా, రష్మీకా. డీల్ రద్దు చేసుకుంటే డబ్బులు పోతాయని, కరోనా భయాలు ఉన్నప్పటికీ రిబ్బన్ కటింగ్ కు వెళ్లి జనాలతో తిట్లు తినింది రష్మి.
ఇక అనసూయ విషయానికొద్దాం. సామాన్యులు, రోజుకూలీల గురించి మాట్లాడుతూ.. పనిలోపని తనను కూడా అందులో కలిపేసుకుంటూ… “మేము ఈఎంఐలు ఎలా కట్టాలి, కరెంట్ బిల్లులు ఎలా కట్టాలంటూ” ట్వీట్ పెట్టింది. దీంతో అనసూయ ఫాలోవర్స్ కే కాదు, కేటీఆర్ ని ఫాలో అయ్యే సీరియస్ పొలిటీషియన్లు, అధికారులు, మీడియా పర్సన్స్ అందరికీ ఈ మెసేజ్ వెళ్లింది, ఇంకేముంది అనసూయ బాగా ట్రోలింగ్ కు గురైంది.
ఇటు అనసూయకు, అటు రష్మీకి ఇలాంటి ట్రోలింగ్స్ కొత్తకాదు. కాకపోతే ఇద్దరూ ఇలా ఒకేసారి ట్రోల్ కు గురవ్వడం, పైగా టాపిక్ కూడా ఒకేటే కావడం యాధృచ్ఛికం.