ఒకవైపు ప్రైవేట్ కంపెనీలకు నీతులు వల్లెవేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. వాళ్లు ఎలాగూ ఆ పాటి జాలిని కలిగే ఉంటారు. తమ వద్ద పని చేసే వాళ్లతో పాటు తాము కూడా ఇప్పుడు కష్టాల్లోనే ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ఇండస్ట్రీ అయినా తమ ఉద్యోగుల పట్ల జాలిదయతో వ్యవహరించే అవకాశాలున్నాయి. అయితే మోడీ సర్కారు మాత్రం.. సందడిలో సడేమియా అన్నట్టుగా, పార్లమెంట్ లో చట్టాలతో ప్రజలను దోపిడీ చేసే వైనాన్ని కొనసాగిస్తూ ఉంది.
పార్లమెంట్ నిరవధికవ వాయిదాకు కొద్ది సేపటి ముందు మోడీ ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశ పెట్టి, చర్చ లేకుండా దాన్ని ఆమోదించేసుకుంది. ఇది దేశ ప్రజలను దోపిడీ చేయడానికి సంబంధించినది. పన్నులతో రాబడి పెంచుకోవడమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన బిల్లు. దేశంలో సంపద పెంచడం అంటే.. ప్రజల మీద పన్నులు వేయడం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. ఆర్థిక వనరులను పెంపొందించి ప్రజలకు లాభం చేకూర్చి, దాంతో ప్రభుత్వ ఖజనాను కూడా నింపుకోవడం మాట ఎలా ఉన్నా, పెట్రెల్-డీజిల్ ల మీద అయిన కాడికి సంపాదించుకోవడమే లక్ష్యంగా మోడీ సర్కారు మరో బిల్లు పెట్టింది.
ఒకవైపు ప్రజలు కరోనా గురించి చర్చించుకుంటూ ఉంటే, ఆ భయాందోళనల్లో ఉంటే.. పెట్రోల్-డీజిల్ లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచుకోవడానికి వీలుగా ఒక బిల్లను ఆమోదించింది మోడీ ప్రభుత్వం. ఇది వరకూ లీటర్ పెట్రోల్ పై గరిష్టంగా పది రూపాయలు, లీటర్ డీజిల్ పై గరిష్టంగా 4 రూపాయలు మాత్రమే ఎక్సైజ్ సుంకాన్ని విధించేందుకు అవకాశం ఉండేది. రేట్ల నియంత్రణలో ప్రభుత్వ వేసే పన్నులకూ కొంత నియంత్రణ ఉండేది. అయితే మోడీ సర్కారు దీన్ని అమాంతం పెంచింది.
పార్లమెంట్ లో ఆమోదించిన చట్టం ప్రకారం.. ఇక నుంచి లీటర్ పెట్రోల్ పై 18 రూపాయలు, లీటర్ డీజిల్ పై 12 రూపాయల వరకూ ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు లైన్ క్లియర్ చేసుకుంది మోడీ ప్రభుత్వం. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో.. ఇలా పెట్రో ఉత్పత్తులపై ఇష్టానుసారం పన్నును పెంచేసి, దేశ ప్రజల నుంచి వీలైనంతగా దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం లైన్ క్లియర్ చేసుకుంది.
మాటెత్తితే నెహ్రూ నుంచి, మన్మోహన్ వరకూ అందరి పాలననూ బీజేపీ వాళ్లు విమర్శిస్తారు. అయితే వీళ్లు దారి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్సైజ్ సుంకాలను ఇష్టానికి పెంచేసి.. విదేశాల నుంచి తెచ్చిన పెట్రోల్ ను దేశీయంగా భారీ లాభాలకు అమ్ముకునే వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. పన్నులు వేయకుండా సంక్షేమం ఎలా? అనే ప్రశ్నను మోడీ భక్తులు ఇక్కడ వేయవచ్చు. పన్నులు వేసి చేసేది సంక్షేమం కాదు, వ్యాపారం. సంక్షేమం కోసం ఆర్థిక వనరులను సృష్టించాలి, అదీ పాలకుడు చేయాల్సిన పని. వ్యాపారం చేసి లాభం సంపాదించి దాన్ని సంక్షేమం మీద ఖర్చు అనడం ఏ చాణుక్యుడు చెప్పిన రాజనీతిజ్ఞతో మోడీకి, బీజేపీ వాళ్లకు, వారి భక్తులకే తెలియాలి. ఇదే పెట్రోల్ ధరలు మన్మోహన్ హయాంలో ఏ మాత్రం పెరిగినా మోడీ ఎలా స్పందించారో పాత ట్వీట్లను వెదికితే స్పష్టం అవుతుంది. అడ్డగోలుగా పెట్రోల్ ధరలను పెంచుకోవడానికి పార్లమెంట్ లోనే ఆమోదం వేయించుకున్నారు మోడీ మహాశయులు. ఇదీ పాలనంటే!