జగన్ సర్కార్ అత్యుత్సాహం…ప్రభుత్వానికి ఒక్కోసారి అప్రతిష్ట తీసుకొస్తోంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ధోరణి జగన్ సర్కార్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతే తప్ప, రెండో వర్సన్ వినిపించుకునే లక్షణం జగన్ సర్కార్లో ఎంత మాత్రం లేదు. ఇదే జగన్ సర్కార్ కొంప ముంచుతోంది.
మరీ ముఖ్యంగా న్యాయస్థానాల్లో పదేపదే జగన్ సర్కార్కు ఎదురు దెబ్బలు తగలడానికి ఈ ధోరణే కారణమవుతోంది. అయినా సర్కార్లో మార్పు రాకపోగా, మరింత మొండిగా వ్యవహరిస్తోంది. చివరికి జగన్ సర్కార్లోని ఈ మొండితనం, లెక్కలెని తనం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో తెలియదు కానీ, సరైన విధానమైతే కాదు.
సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులో నాలుగు కేసులకు సంబంధించి తనకు ప్రతికూల తీర్పులు వచ్చిన రోజే…హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై జగన్ సర్కార్ జీవో జారీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వైఖరే జగన్ సర్కార్కు మొట్టిక్కాయలు పడేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంత తొందర, ఏమిటా ఆవేశం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అంశంపై ఏమిటా లెక్కలేని తనం? న్యాయస్థాన ఇగోను దెబ్బతీయడం కాదా?
రాష్ట్రంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలుగు మాధ్యమంలో చదువుకోవాలనుకున్న వాళ్లకు ఆప్షన్ ఎందుకివ్వరని జగన్ సర్కార్ను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో మండలానికో తెలుగు మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామని, అక్కడికెళ్లి చదువుకునే విద్యార్థుల రవాణా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని జగన్ సర్కార్ ఈ మేరకు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీనిపై ఇంకా హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇవేవీ పరిగణించకుండా జగన్ సర్కార్ తన అఫిడవిట్నే ఫైనల్గా భావించి సోమవారం ఓ జీవో జారీ చేసింది.
దీనిపై వివాదం నెలకొంది. సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులో సోమవారం జగన్ సర్కార్ తీసుకున్న నాలుగు నిర్ణయాలకు సంబంధించి ప్రతికూల తీర్పులు వెలువడ్డాయి. ఎందుకిలా జరుగుతోంది, తన వైపు నుంచి ఏం తప్పులు జరుగుతున్నాయో జగన్ సర్కార్ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి బదులు, మరో వివాదాస్పద జీవో జారీ చేయడం ఎంత వరకు సమంజసం?
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పతాకంలోని రంగులు వేయడం కుదరదని హైకోర్టు చెప్పినా జగన్ సర్కార్ వినిపించుకోలేదు. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా అదే చేదు అనుభవం ఎదురైంది. అలాగే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలోనూ హైకోర్టు స్టే విధించింది. ఇది చట్ట విరుద్ధమని, రాజధానికిచ్చిన భూముల్లో ఇంటి స్థలాలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఆరువేల ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును కూడా హైకోర్టు నిలిపివేసింది. రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భూములు తీసుకుంటున్నారన్న వాదనలతో ఏకీభవించింది. దీంతో పాటు 25 లక్షల మందికి పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత విక్రయించుకునే వీలు కల్పించే ‘కన్వేయన్స్ డీడ్’లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇల్లు కట్టుకుంటామనే షరతు లేకుండా స్థలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించింది.
జగన్ సర్కార్ నిర్ణయాలపై ఒకేరోజు వెలువడిన పైతీర్పుల నేపథ్యంలోనైనా….కనీసం ఒక్క నిమిషం పునఃసమీక్షించుకోవడానికి బదులు మరో వివాదాస్పద జీవో జారీ చేయడం ఏంటి? ఇంగ్లీష్ మాధ్యమంపై హైకోర్టు తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉంది. అంత వరకు ఎదురు చూస్తే జగన్ సర్కార్కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఒకవేళ తాజాగా ఇప్పుడు జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వస్తే పరిస్థితి ఏంటి? అంటే మరోసారి హైకోర్టులో జగన్ సర్కార్కు చుక్కెదురైందని ప్రతిపక్షాలు, ఇతరత్రా ప్రజాసంఘాల నుంచి విమర్శలు రావాలని జగన్ సర్కార్ కోరుకుంటోందా? ఎందుకీ తొందరపాటు, అనాలోచిత నిర్ణయాలు?
జగన్ సర్కార్కు తనకు మించిన శత్రువులు, ప్రత్యర్థులెవరూ లేరని అర్థమవుతోంది. దేన్నీ లెక్క చేయకుండా, ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు దేనికి సంకేతం? ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు సానుకూల వాతావరణంలో జగన్ సర్కార్కు మంచి పేరు వచ్చేలా నిర్ణయాలు, ఆలోచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.