రేషన్ వాహనాలా.. మొబైల్ మార్కెట్లా..?

రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్ సరకుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ కార్యక్రమం మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా స్పష్టమైన విధి విధానాల రూపకల్పనలో అధికారులు వెనకబడే ఉన్నారు.…

రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్ సరకుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ కార్యక్రమం మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా స్పష్టమైన విధి విధానాల రూపకల్పనలో అధికారులు వెనకబడే ఉన్నారు. రేషన్ ట్రక్ వచ్చినప్పుడు సమయానికి లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి. కూలి పనులు పూర్తయ్యాక ఇంటికొచ్చేవారు రేషన్ ఎక్కడ తీసుకోవాలి, రేషన్ పోర్టబిలిటీ అవకాశం ఉందా లేదా..? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే ఒకదాన్ని పరిష్కరిస్తే మరో సమస్య మొదలయ్యే పరిస్థితి ఇది. రేషన్ పోర్టబిలిటీ ప్రకారం ఎవరైనా, ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అనే విధానం ఆల్రడీ ఉంది. ట్రక్కులు వచ్చాక దీన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు మళ్లీ రేషన్ ట్రక్కులకు కూడా దీన్ని అప్లై చేస్తే.. వాలంటీర్ పరిధిలోలేని వారు కూడా రేషన్ తీసుకుంటారు. దానివల్ల స్థానికంగా ఉండే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ ఆలస్యం అవుతుంది.

అసలే వాహనాలు తక్కువ, షాపులు ఎక్కువగా ఉన్న ఈ సందర్భంలో.. నెలంతా రేషన్ పంపిణీ జరుగుతూనే ఉంది. ఒకటో తారీకు కిలో రూపాయి బియ్యం తెచ్చుకుని జీవనం గడుపుకునే కుటుంబాలన్నీ.. రోజుల తరబడి తమ వంతు కోసం వేచి చూడాల్సి రావడంతో అసలు సమస్య మొదలవుతోంది.

కొసరు సమస్యలు ఇంకా అధికం..

జీతాలు తక్కవ అంటూ ఈ పథకం మొదలైన కొత్తల్లోనే రేషన్ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగి తమ పంతం నెగ్గించుకున్నారు. వీరికి జీతాలు పెంచిన తర్వాతే వాలంటీర్లలో అసంతృప్తి మొదలైంది. తమ పక్కనే ఉండే రేషన్ ట్రక్ డ్రైవర్ కి 21వేలు జీతం, నెలంతా పనిచేసినా తమకు రూ.5వేలు మాత్రమే జీతం అనే బేధభావం వారిలో ఏర్పడింది.

వాలంటీర్లపై పని ఒత్తిడి తగ్గించే ఏర్పాట్లు జరగడం సంతోషించదగ్గ పరిణామమే. అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ ట్రక్ లు మొబైల్ సూపర్ మార్కెట్లగా మారిపోతున్నాయి. రేషన్ వాహనాలను ఇతర ఏ అవసరాలకు ఉపయోగించకూడదనేది ప్రభుత్వ నిబంధన. 

కానీ అదే వాహనంలో, సబ్బులు, షాంపులు అమ్ముతూ కొత్త వ్యాపారానికి తెరతీశారు వాహనదారులు. గతంలో రేషన్ డీలర్లు ఎలా బిజినెస్ చేసేవారో.. ఇప్పుడు అదే పద్ధతిలోకి వచ్చేశారు ట్రక్ డ్రైవర్లు. దీనిపై మరింతగా విమర్శలు చెలరేగుతున్నాయి.

డోర్ డెలివరీ అంటే ఏంటి..?

డోర్ డెలివరీ అంటే ప్రజల ఇళ్ల వద్దకు కాదు, రేషన్ ట్రక్ డోర్ వద్దకు అంటూ ఆల్రడీ టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది. కానీ వైసీపీ నేతలు, అధికారులు వీటిని విమర్శలుగా కొట్టిపారేస్తున్నారే కానీ, పరిష్కార మార్గం వెదకడం లేదు. 

డోర్ డెలివరీ కి ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం సరిగ్గా అమలైనప్పుడే రేషన్ ట్రక్కుల పథకానికి సార్థకత. అలా జరగనంతకాలం అదొక విఫల ప్రయోగంలాగానే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించి ట్రక్ ల వ్యవహారంలో కచ్చితమైన విధి విధానాలు రూపొందించాలి.

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే