తమ్ముడు, నా తమ్ముడు, నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తాడు.. అంటూ తిరుపతిలో ప్రచార సభ సభలో పవన్ కల్యాణ్ చేతికి ఎర్ర కండువా కట్టి, రాఖీ స్టైల్లో బిల్డప్ ఇచ్చారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. ఆమె స్టేట్ మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద వైరల్ జోక్ గా మారింది.
పార్టీ అధ్యక్షుడు ప్రధాని మోదీ కంటే ఎక్కువగా పక్క పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జపం చేశారు రత్నప్రభ. కనీసం రాష్ట్ర నాయకుల పేర్లు కూడా చెప్పని ఆమె.. పవన్ పై అంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నారంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.
అసలింతకీ పవన్ కల్యాణ్ పై ఆమె అంతగా ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం ఏంటి? తమ్ముడు, నా తమ్ముడు అంటూ మరీ అంతగా బంధాలు, బంధుత్వాలు కలిపేసుకోవడం దేనికి? జనసైనికుల ఓట్ల కోసమేననేది అక్షర సత్యం. అయితే నిజంగా పవన్ కి రత్నప్రభను గెలిపించగలిగేంత సీన్ ఉందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
పవన్ గెలవగలిగినవాడో, గెలిపించగలిగేవాడో అయితే ఆ సీట్ రత్నప్రభకు ఎందుకిస్తారంటూ నెటిజన్లు జోకులేస్తున్నారు. నిజంగా తిరుపతిలో గెలిచేంత సీన్ ఉంటే, ఆ సీటుని బీజేపీకి ఎందుకు త్యాగం చేస్తారంటూ లాజిక్ తీస్తున్నారు.
తిరుపతిలో గెలిచే అవకాశం లేదని, పోటీ చేసినా పరువుపోతుంది తప్ప ప్రయోజనం లేదని గ్రహించే పవన్ ఆ సీటు త్యాగం చేశారని, అలా ఆ అవకాశం రత్నప్రభకు వచ్చిందని, అంత మాత్రాన పవన్ ప్రచారంతో ఏదో జరిగిపోతుందని ఆశించడం ఆవిడ భ్రమ అని అంటున్నారు నెటిజన్లు. నిజంగా అది గెలిచే సీటు అయితే పవన్ తన సొంత అభ్యర్థినే అక్కడ నిలబెట్టేవారు కదా.
మొత్తమ్మీద రత్నప్రభతోపాటు.. బీజేపీ నేతలు కూడా అదే భ్రమల్లో మునిగిపోయారు. పవన్ కల్యాణ్ రాకతో తిరుపతిలో ఏదో జరిగిపోతుందనే ఆశలు పెట్టుకున్నారు. కాపుల ఓట్లన్నీ గుంపగుత్తగా బీజేపీకి పడిపోతాయని అనుకుంటున్నారు.
పవన్ కి అంత పవరే ఉంటే.. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓడిపోయేవారు కాదు, మిగతా చోట్ల నోటాతో పోటీపడేవారూ కాదు. నిజంగా బీజేపీ భ్రమపడుతున్నట్టు.. పవన్ కు అంత సత్తా ఉందనుకుంటే.. ఆ విషయం ఈ తిరుపతి ఎన్నికతో తేలిపోతుంది.