టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా చిత్ర పరిశ్రమను కరోనా సెకెండ్ వేవ్ కుదిపేస్తోంది. కరోనా వెలుగు చూసిన తొలి రోజుల్లో చిత్ర పరిశ్రమ చాలా జాగ్రత్త పడింది. స్టార్ హీరోలు అన్ని షూటింగులకే కాక అన్ని సమావేశాలకూ దూరదూరంగా నిలిచారు. లాక్ డౌన్ పరిస్థితులు నిమ్మలించాకా మాత్రం కొందరు కదిలారు.
ఆ పరిస్థితుల్లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి, అనారోగ్యం వల్ల మరణించారు. బాలూకు ముందు, తర్వాత పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా మొదట కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఆయన మళ్లీ టెస్టు చేయించుకోగా నెగిటివ్ గా వచ్చిందని ప్రకటించారు.
ఏతావాతా కరోనా గురించి గత ఏడాది ఆఖర్లోనే రిలాక్స అయ్యింది చిత్ర పరిశ్రమ. అయితే.. సెకెండ్ వేవ్ లో మళ్లీ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఫస్ట్ వేవ్ లో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
ఇక సెకెండ్ వేవ్ లో వరస పెట్టి బాలీవుడ్ స్టార్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్ కు కరోనా సోకినట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా పలువురు బాలీవుడ్ హీరోలకు కరోనా సోకినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా టెస్టులు చేయించుకుంటున్నారట. ఇక తాజాగా అక్షయ్ కుమార్ కూడా జాబితాలో నిలిచాడు.
ఇక టాలీవుడ్ కూడా సెకెండ్ వేవ్ కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నట్టుగా ఉంది. అల్లు అరవింద్,త్రివిక్రమ్ లతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నటి నివేదా థామస్ తనకు కరోనా పాజిటివ్ గా తేలిందనే విషయాన్ని ప్రకటించింది.
ఆమెతో పాటు వకీల్ సాబ్ ప్రమోషన్లో పాలుపంచుకున్న నటీనటులు ఇప్పుడు టెస్టులు చేయించుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుగా ఉంది. మొత్తానికి కరోనా పరిస్థితుల్లో సినిమాల షూటింగుల్లో పాల్గొని, తమ తమ సినిమాల విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్న సినిమా వాళ్లను కరోనా కలవర పెడుతున్నట్టుగా ఉంది.