తెలుగు తెరపై ఎన్టీఆర్ కన్నా సీనియర్, ఎన్టీఆర్ తో సమానమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుందా? ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిన సమయంలోనే అక్కినేని బయోపిక్ కూడా చర్చకు వచ్చింది.
ఎన్టీఆర్ కుమారుడు, స్టార్ హీరో బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించాడు. అయితే దాని ఫలితం ఆశాజనకంగా లేదు. కనీసం ఎన్టీఆర్ జీవితాన్ని అయినా వెల్ డాక్యుమెంట్ చేయలేకపోయారు. అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఈ ఏ వర్గాన్నీ ఆ సినిమా మెప్పించలేకపోయింది. అయినా బయోపిక్ ట్రెండ్ అయితే కొనసాగుతూ ఉంది.
ఇప్పటికే పలువురు స్టార్ల బయోపిక్ లు వచ్చాయి, వస్తున్నాయి. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే మరి కొందరు ప్రముఖుల బయోపిక్ లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ క్రమంలో అక్కినేని బయోపిక్ చర్చకు వస్తోంది.
గతంలో ఈ అంశంపై నాగార్జున స్పందిస్తూ.. తన తండ్రి జీవితం చాలా సూటిగా సాగిపోయిందని, ఆయన జీవితంలో కిందపడటం, లేవడం వంటివేమీ లేవని అందుకే దాన్ని డ్రమెటైజ్ చేయడం కుదరదన్నట్టుగా నాగార్జున స్పందించారు. అందుకే అక్కినేని బయోపిక్ ఉండబోదన్నట్టుగా అన్నారు. అయితే ఇప్పుడు నాగార్జున తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టుగా ఉన్నారు.
తన తండ్రి బయోపిక్ తీయాలనే ఉందని, అయితే పొరపాట్లు జరుగుతాయేమో అనే భయం ఉందని నాగ్ అంటున్నారు. అలాంటి భయం ఉన్నప్పుడే జాగ్రత్తగా పని చేస్తామంటూ కూడా తనే ముక్తాయింపునిచ్చారు నాగార్జున. మరి నాగ్ మాటల అంతరార్థం అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ రాబోతోందనా!