ఆవిర్భావంతోనే తెలంగాణలో ఒక ఎంపీ సీటును, మరో మూడు ఎమ్మెల్యే సీట్లను నెగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికే రాష్ట్ర విభజన జరిగినా, జగన్ సమైక్యవాదాన్ని వినిపించినా, తెలంగాణలో అది ఆంధ్రపార్టీ అనే ప్రచారాన్ని తెరాస వాళ్లు చేసినా.. ఒక ఎంపీ సీటును, మూడు ఎమ్మెల్యే సీట్లను నెగ్గింది జగన్ పార్టీ.
అంతేగాక వివిధ నియోజకవర్గాల్లో కొద్దో గొప్పో ఓట్ల శాతాన్ని పొంది ఉనికి అంటూ చాటుకుంది. వేములవాడ ఏరియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఉనికి కనిపించిందప్పట్లోనే! అయితే.. ఏపీలో అధికారాన్ని సాధించుకోవాలనే క్రమంలోనే జగన్ తెలంగాణలో తన పార్టీని గాలికి వదిలేసినట్టుగా వ్యవహరించారు.
ఆ క్రమంలోనే తెలంగాణలో జగన్ మీద ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు కామ్ అయిపోయారు. ఇక ఏపీలో అధికారం సాధించుకున్నాకా జగన్ కు ఆ రాష్ట్రాన్ని పరిపాలించుకోవడమే కీలక బాధ్యతగా మిగిలింది. తెలంగాణలో పార్టీని పునరుద్ధరించే ప్రయత్నాలు ఏవీ జరగలేదు.
ఏపీలో ఇకపై అధికారాన్ని నిలబెట్టుకోవడమే జగన్ కు చేతినిండా పనిలా ఉంటుంది. రెండు పడవల ప్రయాణం కుదరదనే విషయం జగన్ కు చాలా త్వరగానే బోధపడింది. అందుకే ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, ఆ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నా.. పార్టీ పునరుద్ధరణ ప్రయత్నాలు చేయలేదు.
ఆ మధ్య వైఎస్ జగన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హుజూర్ నగర్ వంటి చోట తమకు ఉనికి ఉందన్నారు. అక్కడ తమ పార్టీ పోటీ చేసి ఉంటే..గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచేవాడు కాదని జగన్ అన్నారు. రెడ్ల జనాభా, వైఎస్ అభిమానగణం ఉన్న చోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉపయోగపడగలవు. అయినా జగన్ అక్కడ పార్టీ విషయంలో నిమ్మకు నీరెత్తడంతో మిగిలిన ఒకరిద్దరు కూడా జారుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా ప్రకటన చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికే చెందిన శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరేలా ఉన్నారు.
ఇక ఇటీవలే కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్లు షర్మిల వెంట నిలబడుతున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణలో తన పోటీకి నియోజకవర్గాన్ని కూడా ప్రకటించేశారు షర్మిల. ఈ నేపథ్యంలో ఆమె సీరియస్ గానే అక్కడ రంగంలోకి దిగేలా ఉన్నారు. దీంతో.. వైఎస్ అభిమానగణం, కొద్దో గొప్పో రెడ్డి ఓటు బ్యాంకు కూడా షర్మిల వెంట సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
షర్మిల అక్కడ అడుగులు వేసే కొద్దీ జగన్ పార్టీ అడ్రస్ పూర్తిగా షర్మిల కేరాఫ్ గా మారేలా ఉంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవితవ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది.