డాన్ రవి పూజారి.. దాదాపు ఏడాది కిందట ఆఫ్రికా దేశం సెనెగల్ లో అరెస్ట్ అయ్యాడు. ఎట్టకేలకూ కర్ణాటక పోలీసులు అతడిని ఇండియా తీసుకొచ్చారు. బెంగళూరులోని ఒక జైల్లో పెట్టి ఇప్పుడు విచారణ సాగిస్తూ ఉన్నారు. సినిమాల్లో చూ పించే డాన్ స్టోరీలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది ఈ డాన్ ఇండియాలో రౌడీయిజం చేయించే చాలా మంది డాన్లు విదేశాల్లో ఉండటం, అక్కడ డాన్ స్థావరం ఏదో కనుకోవడం పోలీసులకు అసలే మాత్రం సాధ్యం కాకపోవడం.. వంటివన్నీ జరిగాయి ఈ డాన్ విషయంలో. ఇతడిని పట్టుకురావడానికి పోలీసులు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ముంబై మాఫియా సామ్రాజాన్ని శాసించిన ఒకప్పటి డాన్ చోటా రాజన్ అనుచరగణంలో ఒకడు ఈ రవి పూజారి. కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాజన్ అనుచరుడిగా అనేక మంది సినిమా వాళ్లను, రాజకీయ నేతలను సైతం బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేపథ్యం ఉంది ఇతడికి. బాలీవుడ్ ప్రముఖ సినిమా తారలంతా రవి పూజారి బాధితులే అనే వివిద సందర్భాల్లో వార్తలు వచ్చాయి. షారూక్ ఖాన్, ప్రీతీ జింతా వంటి వాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేపథ్యం ఉందట ఇతడికి. అలాగే ఇలాండి డాన్ లను సదరు సినిమా వాళ్లు కూడా.. వివిధ సమయాల్లో ఉపయోగించుకున్నారనే వార్తలూ వచ్చేవి అప్పట్లో. అలాగే రాజకీయ నేతలను సైతం బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేపథ్యం ఉండటం రవి పూజారి విషయంలో విశేషం. మాజీ ప్రధాని దేవేగౌడ తనయుడు రేవణ్ణ ను కూడా ఇతడు బెదిరించాడట! ఈ రేంజ్ డాన్ ఈ రవి పూజారి.
వంద కేసులు నమోదు అయ్యాయి ఇతడి మీద. చాలా సంవత్సరాల కిందటే ఇండియా విడిచి వెళ్లిపోయాడు. ఆఫ్రికాలోని సెనెగల్ లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అక్కడ మారు పేర్లతో, నకిలీ పాస్ పోర్టులు తయారు చేయించుకుని ఒక రెస్టారెంట్ మెయింటెయిన్ చేస్తూ ఉండేవాడట. అయితే ఇతడి కోసం పోలీసులు వేట కొనసాగించింది. ఇతడి జాడ గుర్తించారు. ఆఫ్రికా దేశం కావడంతో.. అక్కడి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడం భారత పోలీసులకు సులువు అయ్యింది. అరెస్టు అయిన ఏడాదికైనా ఇండియాకు పట్టుకొచ్చారు.
అయితే రవి పూజారిని ఇప్పుడేం విచారిస్తారు? ఎన్నో యేళ్లుగా ఇండియాలో డాన్ ల అలికిడి లేదు. అన్నీ పాత కేసులే. అప్పుడు కేసులు పెట్టిన సెలబ్రిటీలు కూడా ఇప్పుడు వాటిని పట్టించుకోకపోవచ్చు. ఈ డాన్ కు కూడా వయసు మీద పడి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనను పోలీసులు విచారిస్తున్నారట. అయితే పూజారి మీద కొన్ని హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇతడిని జైలుకు పరిమితం చేయడానికి అవి చాలేమో!