వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా మూడో ఏడాది కూడా రాయలసీమ ప్రాజెక్టులకు జలకళ సంతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, కురుస్తున్నాయి, అంతే కాదు ఎగువన కూడా భారీ వర్షాలు కురవడంతో వరసగా మూడో ఏడాది కూడా రాయలసీమ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో జలకళ సంతరించడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
ఇప్పటికే ఆల్మట్టి నుంచి నీటి విడుదల జరుగుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కులకు పై స్థాయిలో నీరు లభిస్తోంది. నీటి మట్టం కనీస స్థాయిని మించింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 854 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి సీమ ప్రాజెక్టులకు నీటి విడుదల సాధ్యం అవుతుంది. ఆ మట్టానికి నీరు దాదాపు చేరుతోంది.
శ్రీశైలం మీద ఆధారపడిన రాయలసీమ ప్రాజెక్టులకు జూలై నెలాఖరు నుంచినే జలకళ సంతరించుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఏడాది ఆగస్టు నెలాఖరుకు శ్రీశైలానికి నీటి లభ్యత పెరిగింది. ఆ సంవత్సరం ఆగస్టు లో మంచి వర్షాలు కురిశాయి. ఇక రెండో ఏడాదిలో ఆగస్టు 15 నాటికే శ్రీశైలానికి మంచి స్థాయిలో నీటి లభ్యత కలిగింది.
ఇక ఈ ఏడాది జూలై ఆఖరుకే శ్రీశైలం నీటి మట్టం కనీస స్థాయికి చేరుకుంటుంది. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారం నీటి విడుదల చేసింది. కరెంటు కష్టాలను అధిగమించడానికి ప్రాజెక్టు నుంచి ఇష్టానుసారం నీటిని వదిలింది. దీంతో నీరు మరింతగా అడుగంటింది. అయితే ముందస్తుగానే ఇప్పుడు నీరు చేరుతండటం రాయలసీమ పాలిట సానుకూల పరిమాణం.
ప్రస్తుతా వాతావరణాన్ని గమనిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద ఈ ఏడాది కూడా సాధ్యం అయ్యేలానే ఉంది. దీంతో కొన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. రాయలసీమకు నీళ్ల అవసరం ఎంతున్నా.. సకాలంలో నీటిని తరలించే అవకాశాలు తక్కువ. అలాగే నీటి నిల్వకు డ్యామ్ ల పరిమాణాన్ని కూడా పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పనులకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో.. రాయలసీమ ఎత్తి పోతల పథకం కీలకమైనది. వరద భారీగా ఉండే సమయంలో.. నీటిని రాయలసీమకు తరలించడానికి అవకాశం ఉంటుంది.
కృష్ణానది ఒకే సారి ఉప్పెనలా వస్తోంది. ఆ సమయంలోనే నీటిని తరలించుకోవాలి. అందుకు అనుగుణంగా వైఎస్ జగన్ సీఎం అయ్యాకా రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని ప్లాన్ చేశారు. అయితే దానికి అటు తెలంగాణ నుంచి అభ్యంతరాలు, కేంద్రం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సీమలో డ్యామ్ ల నిర్మాణం మీద కూడా జగన్ ప్రభుత్వం దృష్టి నిలిపింది. అలాగే హంద్రీనీవా కాలువల సామర్థ్యం పెంపు, దాంతో పాటు ఆ కాలువలకు చెరువల అనుసంధానం కూడా ఎంతో ఉపయుక్తమైనవి. వీటిల్లో కొన్నింటికి జగన్ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇవన్నీ ఆచరణలోకి వస్తే.. రాయలసీమలో సాగు నీటి సమస్య అనేది ఉండదు. కరువు సీమకు శాశ్వత పరిష్కారం లభించినట్టే. లక్షల కోట్ల రూపాయల వ్యవహారం ఏమీ కాదది. వేల కోట్ల రూపాయల్లోనే మొత్తం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకు ఇప్పుడు లోపిస్తున్నది సహకారం మాత్రమే. ఈ పనుల మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే అవాంతరాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇకపై వీటి విషయంలో భగీరథ ప్రయత్నాలను చేయాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు జగన్ మాత్రమే చేయాల్సి ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏ రకంగా సహకరించడం మానేసి, ప్రతిగా విమర్శలు చేస్తున్నాయి.
ఇక రాయలసీమకు సంబంధించి మరో సానుకూలాంశం భారీ వర్షాలు. అనంతపురం జిల్లాలో కూడా ఈ ఏడాది ఇప్పటికే మంచి వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి కొన్ని చోట్ల. వేరుశనగ సాగు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింత భారీ వర్షాలు కురిస్తే.. చెరువులు నిండే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ సీఎం అయ్యాకా వరసగా మూడో ఏడాది కూడా సీమకు జలకళ సంతరించుకోనుంది.