విజయా రెడ్డి హత్య.. అసలు కారణాలివే!

పట్టపగలు.. ప్రభుత్వ కార్యాలయం.. మహిళా తహశీల్దారు హత్య. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థంకాలేదు. వ్యక్తిగత కక్షలని కొందరు భావిస్తే, విజయానే ఆత్మహత్య చేసుకుందని మరికొందరు భావించారు.…

పట్టపగలు.. ప్రభుత్వ కార్యాలయం.. మహిళా తహశీల్దారు హత్య. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థంకాలేదు. వ్యక్తిగత కక్షలని కొందరు భావిస్తే, విజయానే ఆత్మహత్య చేసుకుందని మరికొందరు భావించారు.

ఎట్టకేలకు ఈ హత్య వెనక కారణాల్ని బయటకు తీశారు పోలీసులు. వృత్తిపరంగా ఎదురైన కక్షల వల్లనే విజయా రెడ్డి హత్య జరిగినట్టు స్పష్టంచేశారు.

దాదాపు రెండేళ్లుగా ఓ సమస్య పరిష్కారం కోసం విజయారెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం బాచారం గ్రామస్తుడు సురేష్. దాదాపు 412 ఎకరాలకు సంబంధించిన భూవివాదం ఇది.

నిజానికి ఈ భూములు వాళ్లవి కావు, గతంలో ఓ జమీందార్ కు చెందినవి. అతడు కుటుంబంతో పాటు మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో కొంతమంది కలిసి సాగు చేసుకుంటున్నారు.

రియల్ ఎస్టేట్ కారణంగా తాజాగా ఈ భూముల విలువ పెరిగింది. దీంతో కోర్టు కేసులు కూడా పడ్డాయి. దాదాపు 130 ఎకరాల భూమి తమదంటూ మరికొంతమంది కేసులు వేశారు. అయితే ఆ 130 ఎకరాల్లో తనకు వారసత్వంగా వచ్చిన రెండెకరాలు కూడా ఉందని వాదిస్తున్నాడు సురేష్. దీనికి సంబంధించి ఏడాదిగా విజయా రెడ్డిని తరుచుగా సంప్రదిస్తున్నాడు. 

తనకు సంబంధించిన భూమిని విజయారెడ్డి తనకు కాకుండా చేసిందనే కక్షతో సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆఫీస్ లో ఎవరూ లేని టైమ్ చూసి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు.

అందరూ చూస్తుండగానే తహశీల్దారు సజీవ దహనయ్యారు. ఈ ఘటనలో గాయాలతో బయటపడ్డాడు సురేష్. అతడ్ని మొదట ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేసిన పోలీసులు, తర్వాత ఉస్మానియాకు తరలించారు.

విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిని హత్య చేయడం చాలా పెద్ద నేరం. పైగా ప్రభుత్వ కార్యాలయం కావడంతో సురేష్ కు ఉరిశిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు కొంతమంది లాయర్లు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదంటూ, విజయారెడ్డి హత్యకు నిరసనగా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం 3 రోజుల పాటు విధుల్ని బహిష్కరించింది.