కేసీఆర్ Vs కార్మికులు.. ఏం జరగబోతోంది? ఈరోజే ఆఖరి రోజు. ఈరోజు రాత్రి 12 గంటల లోపు విధుల్లోకి చేరకపోతే ఇక వాళ్లని ఉద్యోగులుగా గుర్తించమని కేసీఆర్ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, మిగిలిన ఈ కొద్ది గంటల్లో ఎంతమంది విధుల్లోకి వస్తారు, ఎంతమంది ఉద్యమబాటలో నడుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం హైకోర్టులో జరగనున్న వాదనలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి, ఈ సందర్భంగా మరోసారి డెడ్ లైన్ గుర్తుచేశారు.
ఉద్యోగాల్లో చేరాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా ఇప్పుడు కార్మికుల చేతుల్లో ఉందన్నారు కేసీఆర్. గడువు తర్వాత ఏ ఒక్క కార్మికుడ్ని విధుల్లోకి తీసుకోమని మరోసారి స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇచ్చామని, కార్మికులు విధుల్లోకి చేరకుండా మిగిలిన రూట్లలో కూడా ప్రైవేటుకు అనుమతి ఇస్తాని, అప్పుడు ఆర్టీసీ అనేదే ఉనికిలో లేకుండా పోతుందని హెచ్చరించారు. ఆర్టీసీ రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని సూచించారు.
మరోవైపు కోర్టు వ్యవహారాలపై కూడా సీఎం స్పందించారు. కోర్టులో కేసు ఉందంటూ యూనియన్లు కార్మికుల్ని మభ్యపెడుతున్నాయని, ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని, అంతేతప్ప వెనక్కి తగ్గేది లేదంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
కేసీఆర్ అల్టిమేటమ్ కు భయపడి ఆదివారం కొంతమంది విధుల్లో చేరారు. సోమవారం కూడా మరికొంతమంది హాజరయ్యారు. డ్యూటీకి వస్తున్నట్టు అంగీకార పత్రాలిచ్చారు. అయితే ఇలా డ్యూటీలకు వెళ్లిన వాళ్లలో చాలామంది మళ్లీ తిరిగి ఉద్యమంలోకి వచ్చారని అంటున్నాయి యూనియన్లు.
ఇప్పటికే సమ్మె ప్రారంభమై నెల రోజులు దాటడంతో.. ఈరోజు రాత్రితో గడువు ముగియనుండడంతో.. కార్మికులు ఏం చేస్తారనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది.