ఏపీ అధికార పార్టీ వైసీపీ తన విషయానికి వస్తే మాత్రం పొదుపు మంత్రాన్ని జపిస్తోంది. ఇదే తన ప్రభుత్వ విషయానికి వస్తే మాత్రం ఆ స్పృహ కొరవడింది. ఇష్టానుసారం ఖర్చు చేస్తూ, చివరికి ప్రభుత్వ ఆస్తుల్ని కూడా తనఖా పెట్టాల్సిన దుస్థితి.
తాజాగా పార్కులను కూడా కొదవపెట్టి నిధులు సేకరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ఆదాయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థల తాజా నివేదిక చర్చనీయాంశమైంది.
ఈ నివేదిక ప్రకారం ఏపీ అధికార పార్టీ వైసీపీ తనకొస్తున్న ఆదాయంలో తక్కువ ఖర్చు చేస్తూ, ఎక్కువ పొదుపు చేస్తోంది. ఇదే ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ విషయానికి వస్తే ఆదాయానికంటే ఎక్కువ ఖర్చు చేస్తూ విమర్శలపాలవుతోంది. గతంలో తన పాలనలో ఇలాగే చేసి అధికారాన్ని పోగొట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక నివేదిక విషయానికి వస్తే…. 2021 అక్టోబరు 11 నాటికి దేశవ్యాప్తంగా 42 ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను ఏడీఆర్ వెల్లడించింది. టీఆర్ఎస్కు రూ.130.46 కోట్లు (14.86 శాతం), శివసేనకు రూ.111.40 కోట్లు (12.69 శాతం), వైఎస్సార్సీపీకి రూ.92.739 కోట్లు (10.56 శాతం), టీడీపీకి రూ.91.53 కోట్లు (10.43 శాతం), బిజూ జనతాదళ్‌కు రూ.90.35 కోట్లు (10.29 శాతం) వచ్చాయి.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ రూ.21.18 కోట్లు, ఏపీ అధికార పార్టీ వైసీపీ రూ.37.83 కోట్లు, టీడీపీ రూ.108.84 కోట్లు ఖర్చు చేశాయి. అయితే ఆదాయం కంటే టీడీపీ ఎక్కువ ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. ఇదే టీఆర్ఎస్, వైసీపీలు మాత్రం పొదుపుగా వాడుకోవడాన్ని గమనించొచ్చు.
వైసీపీ కంటే టీఆర్ఎస్ మరింత ఎక్కువ పొదుపు పాటించింది. టీఆర్ ఎస్ అత్యధికంగా రూ.109.27 కోట్లు మిగిల్చింది. వైసీపీ మాత్రం రూ.54.90 కోట్ల మిగులుతో ఉంది. టీడీపీ రూ.17.31 కోట్లు ఎక్కువ ఖర్చు చేసి అప్పుల్లో ఉంది. పార్టీలో మాత్రం పొదుపు పాటిస్తున్న వైసీపీ, ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడమే అసలు సమస్యగా మారింది. ఇదే పొదుపు సూత్రాన్ని ప్రభుత్వంలో అమలు చేస్తే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.