దాంప‌త్యంలో మీ ఉనికి కోల్పోతున్నారా? ఇలా అయితే!

సెల‌బ్రిటీల వివాహాలు, విడాకుల వ్య‌వ‌హారాలను కేవ‌లం మ‌సాలా వార్త‌లుగా చూడ‌లేం. విజ‌య‌వంతంగా దాంప‌త్య జీవితాన్ని కొన‌సాగిస్తున్న వాళ్లంతా ఆనందంగా ఉన్న‌ట్టు కాదు, విడాకులు తీసుకుని విడిపోయే వారు జీవితంలో ఫెయిల‌యిన‌ట్టూ కాదు! స‌మాజానికో, కుటుంబానికో…

సెల‌బ్రిటీల వివాహాలు, విడాకుల వ్య‌వ‌హారాలను కేవ‌లం మ‌సాలా వార్త‌లుగా చూడ‌లేం. విజ‌య‌వంతంగా దాంప‌త్య జీవితాన్ని కొన‌సాగిస్తున్న వాళ్లంతా ఆనందంగా ఉన్న‌ట్టు కాదు, విడాకులు తీసుకుని విడిపోయే వారు జీవితంలో ఫెయిల‌యిన‌ట్టూ కాదు! స‌మాజానికో, కుటుంబానికో భ‌య‌ప‌డి దాంప‌త్య జీవితాల్లో ఉండేవారెంతో మంది ఉంటార‌నేది ఏదో గాలికి చెప్పే మాట కాదు. 

ఆర్థికంగా, సామాజికంగా భ‌ద్ర‌త ఉంద‌నుకునే వాళ్లు విడాకుల ఆలోచ‌న‌ను చాలా ఈజీగా అమ‌లు చేయ‌వ‌చ్చు. ఈ జాబితాలో ఆర్థిక భ‌ద్ర‌త ఉన్న సెల‌బ్రిటీలు ముందు వ‌ర‌స‌లో హైలెట్ అవుతూ ఉంటారు. ఆ సంగ‌త‌లా ఉంటే.. దాంప‌త్య  జీవితంలో స్త్రీ కావొచ్చు, పురుషుడు కావొచ్చు. అనేక సంద‌ర్భాల్లో త‌న ఉనికిని కోల్పోతున్న భావ‌న‌ను పొంద‌వ‌చ్చు! పార్ట్ న‌ర్ ను ఆనందంగా ఉంచ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా వ్య‌వ‌హ‌రించ‌డమే.. దీనికి తొలి మెట్టు!

పార్ట్ న‌ర్ ను ఆనందంగా, త‌న కంఫ‌ర్ట్ మేర‌కు ఉంచ‌డం దాంప‌త్యంలో ప్ర‌థమ విధే కావొచ్చు కానీ, ఇందుకోసం త‌న ఉనికి కోల్పోవ‌డం మాత్రం అంత గొప్ప విష‌యం కాదు. స్త్రీకి అయినా, పురుషుడికి అయినా ఈ నియ‌మం వ‌ర్తిస్తుంది. మ‌రి వైవాహిక జీవితాన్ని భ‌ద్రంగా ఉంచ‌డం గురించి వ్య‌క్తిత్వాన్నే కాదు, వ్య‌క్తిగ‌తాన్నే బ‌లిపెట్టాల్సిన ప‌రిస్థితి రావ‌డం శోచ‌నీయం. ఇంత‌కీ ఆ ప‌రిస్థితుల‌కు సంకేతాలు ఏమిటో ఒకసారి త‌రచి చూస్తే..

అనుక్ష‌ణం త‌నను ఆనందంగా చూడాల‌నుకోవ‌డం!

ప్రేమ వివాహం కావొచ్చు, పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి కావొచ్చు… ఏ బంధంలో అయినా.. అనుక్ష‌ణం పార్ట్ న‌ర్ ను ఆనందంగా ఉంచాలి, ఏ విష‌యంలోనూ త‌ను హ‌ర్ట్ కాకూడ‌ద‌ని అనుకోవ‌డ‌మే తొలి పొర‌పాటు! భార్య‌పై, భ‌ర్త‌పై ఎంత ప్రేమాభిమానం ఉన్నా.. ప్రాక్టికాలిటీని దాటిపోయి సంతోష పెట్టాల‌ని అనుకోవ‌డం నాన్ సెన్సిక‌ల్. 

పెళ్లైన కొత్త‌లో కొంత మురిపెం ఉండ‌వ‌చ్చేమో కానీ, ఆ త‌ర్వాత అలాంటి మురిపాలను అతిగా కురిపించ‌డం, కురిపించాల‌నుకోవ‌డం ఆనంద‌క‌ర‌మైన దాంప‌త్యానికి తార్కాణం కాదు! ఏడిపించాల‌ని కాదు, ఇబ్బంది పెట్టాల‌ని కాదు.. ప్రాక్టిక‌ల్ గా ఉంటే అదే ఆరోగ్య‌క‌ర‌మైన బంధం.

సొంత ఆలోచ‌న‌ల‌కు చెక్ పెట్టుకోవ‌డం!

దాంప‌త్యంలో ఎన్నో విష‌యాల గురించి చెరో అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాల‌ను ఓపెన్ గా చెప్ప‌లేక‌పోవ‌డానికి మించిన దుర్భ‌ర ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇరువురికి, కుటుంబానికి, పిల్ల‌ల‌కూ సంబంధించిన ఏ విష‌యంలో అయినా.. ఇద్ద‌రూ త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వ్య‌క్తీక‌రించే ప‌రిస్థితి త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. 

చ‌ర్చించుకుని, ఏదో ఒక‌టి డిసైడ్ కావ‌డం త‌దుప‌రి మెట్టు. అయితే క‌నీసం త‌మ ఆలోచ‌న‌ను పంచుకునే స్వ‌తంత్రం లేక‌పోవ‌డం, పంచుకుంటే అవ‌త‌ల వారు ఏమ‌నుకుంటార‌నుకుని మ‌న‌సులోని ఆ ఆలోచ‌న‌కు చెక్ పెట్టుకోవ‌డం మొద‌లైతే.. మిమ్మ‌ల్ని మీరు కోల్పోవ‌డం మొద‌లైన‌ట్టే!

షెడ్యూల్ ను ఒక్క‌రే డిసైడ్ చేయ‌డం!

ఉద‌యం ఇంత‌కే లేవాలి, ఈ రోజే పుట్టింటికి వెళ్లాలి, చెప్పిన రోజే రావాలి.. ఇక్క‌డితో మొద‌లుపెడితే, కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి! నా కంఫ‌ర్ట్ మేర‌కే ఏదైనా జ‌రగాల‌ని భ‌ర్త కానీ, భార్య‌కానీ భావిస్తే.. నిస్సందేహంగా అది గొప్ప దాంప‌త్య‌బంధం కాదు. 

ఏ విష‌యంలో అయినా ప్లాన్ అయితే ఉండాలి. కానీ ఆ ప్లాన్ కేవ‌లం ఒక‌రి కనుస‌న్న‌ల్లో మాత్ర‌మే సాగ‌డం మాత్రం స‌మంజ‌సం కాదు. ప‌ర‌స్ప‌ర అవ‌స‌రాల‌ను అర్థం చేసుకుని, ఈ విష‌యంలో చ‌ర్చించుకోకుండానే.. అన్ని ప‌నుల‌నూ  షెడ్యూల్ చేసుకోవ‌డం మాత్రం అర్థ‌వంత‌మైన దాంప‌త్యం.

మీ ఆస్తక్తుల‌న్నీ పార్ట్ న‌ర్ కేంద్రంగానే ఉండ‌టం!

త‌న‌కు ఇష్ట‌మైన రంగు దుస్తులు, త‌న‌కు ఇష్ట‌మైన ర‌కమైన విధంగానే ఉండ‌టం, త‌న ఆస‌క్తే మీ ఆస‌క్తిగా మారిపోవ‌డం, బ‌ల‌వంతంగా అయినా అల‌వ‌రుచుకోవ‌డం అంత స్వేచ్ఛాయుత‌మైన దాంప‌త్యం కాదు. మీ ఆస‌క్తుల‌న్నీ అవ‌త‌లి వారి ఆస‌క్తి మేర‌కే సాగుతున్నాయంటే.. క్రమంగా మిమ్మ‌ల్ని మీరు కోల్పోతున్న‌ట్టే!

మిమ్మ‌ల్ని మీరు వ్య‌క్తీక‌రించుకోలేక‌పోవ‌డం!

ఏం చెబితే ఏమ‌నుకుంటుందో, ఏం చెబితే ఏమంటాడో.. అనే ప‌రిస్థితికి మించి దాంప‌త్యంలో ఇబ్బందిక‌ర‌మైన స్థితి మ‌రోటి ఉండ‌దు. చెబితే వింటుంద‌ని కాక‌పోయినా, ముందుగా మిమ్మ‌ల్ని మీరు ఎక్స్ ప్రెస్ చేసుకునే ప‌రిస్థితి ఉండాలి. చెబితే అరుస్తాడేమో అనుకున్నా.. చెప్ప‌గ‌లిగే ప‌రిస్థితి ఉండాలి. అదే ఆద‌ర్శ‌వంత‌మైన దాంప‌త్యం. 

అన్ని ఫీలింగ్స్ నూ మీలోనే ఫిల్ట‌ర్ చేసుకుంటూ ఉండ‌టం మిమ్మ‌ల్ని మీరు వ్య‌క్తీక‌రించుకోలేక‌పోవ‌డం కూడా బంధం బ‌ల‌హీన‌త‌కు నిద‌ర్శ‌నం. అలాగే ప్ర‌తి సారీ ఒక‌రే కాంప్ర‌మైజ్ కావ‌డం, అన్నింటా ఒక‌రిదే పై చేయి కూడా.. బ‌య‌టి వారి ముందు కూడా బంధాన్ని బ‌ల‌హీనంగా నిలుపుతుంది. ఈ రియాలిటీస్ ను చెక్ చేసుకుంటూ ముందుకు సాగ‌డం ఆరోగ్య‌క‌ర‌మైన బంధం.