బాల‌కృష్ణ‌.. నువ్వు ఎమ్మెల్యేవి కాక‌ముందే..!

పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ నిర‌స‌నకు రెడీ అవుతున్నారు. హిందూపురాన్ని కాదని పుట్ట‌ప‌ర్తిని జిల్లాగా ప్ర‌క‌టించార‌నేది బాల‌కృష్ణ అభియోగం. అయితే.. బాల‌కృష్ణ అనంత‌పురం జిల్లాకు కొత్త కావొచ్చు.…

పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ నిర‌స‌నకు రెడీ అవుతున్నారు. హిందూపురాన్ని కాదని పుట్ట‌ప‌ర్తిని జిల్లాగా ప్ర‌క‌టించార‌నేది బాల‌కృష్ణ అభియోగం. అయితే.. బాల‌కృష్ణ అనంత‌పురం జిల్లాకు కొత్త కావొచ్చు. మ‌హా అంటే 2014 నుంచి బాల‌కృష్ణ అనంత‌పురం వైపు వ‌చ్చి ఉండొచ్చు. ఇప్ప‌టికీ ఆయ‌న చుట్ట‌పుచూపు ఎమ్మెల్యేనే. 

అయితే ఇప్పుడు హిందూపురం జిల్లా ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో బాల‌కృష్ణ ఇదైపోతున్నారు. కానీ బాల‌కృష్ణ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. పుట్ట‌ప‌ర్తి ని జిల్లాగా చేయాల‌నే డిమాండ్ ద‌శాబ్దాలుగా ఉంది. ఈ జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌ల సంగ‌తి అనేది ఒక‌టి లేక‌ముందే.. పుట్ట‌ప‌ర్తిని జిల్లా చేయాల‌ని స్థానికంగా నినాదం ఉంది. 

స‌త్య‌సాయి బాబా శైవ‌క్యానికి మునుపే పుట్ట‌ప‌ర్తిని జిల్లా చేయాల‌ని, జిల్లాగా చేస్తార‌నే ప్ర‌చారాలున్నాయి. పుట‌ప‌ర్తికి విమానాశ్ర‌యం, రైల్వే స్టేష‌న్ ను నిర్మించిన స‌త్య‌సాయి.. ఉండ‌గానే, జిల్లా కేంద్రంగా కూడా పుట్ట‌ప‌ర్తిని జిల్లా చేస్తార‌ని, దీనికి ప్ర‌భుత్వాలు కూడా సానుకూలంగా ఉన్నాయ‌నే మాట వినిపించేది. అయితే అది జ‌ర‌గ‌లేదు.

ఇక హిందూపురం సంగ‌తికి వ‌స్తే, హిందూపురం ఇప్ప‌టికే నిండుగా ఉంది. బెంగ‌ళూరుకు చాలా ద‌గ్గ‌ర్లో ఉన్న ప‌ట్ట‌ణం కావ‌డం, ద‌శాబ్దాల నుంచి పరిశ్ర‌మ‌ల‌కు కేంద్రంగా ఉండ‌టంతో, హిందూపురం ర‌ద్దీగా ఉంది. దానికి తోడు.. ప‌ట్ట‌ణం బాగా ఇరుకు. హిందూపురానికి ఇదే బాల‌కృష్ణ ఏడెనిమిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా.. పట్ట‌ణంలో పెద్ద మార్పు లేదు. ఇరుకు రోడ్లు, అన్ ప్లాన్డ్ నిర్మాణాల‌తో.. హిందూపురం గ‌జిబిజిగా ఉంటుంది.

పుట్ట‌ప‌ర్తి పూర్తి వెల్ ప్లాన్డ్ టౌన్. నీటి వ‌న‌రుల సంగ‌తికి వ‌చ్చినా… పుట్ట‌ప‌ర్తి బెట‌ర్. ఆధ్యాత్మిక నేప‌థ్యం, అభివృద్ధి.. ఇవ‌న్నీ కూడా పుట్ట‌ప‌ర్తికి సానుకూలాంశాలు. ఏ ర‌కంగా చూసినా.. హిందూపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఊర్ల‌న్నింటికీ, హిందూపురం క‌న్నా పుట్ట‌ప‌ర్తి బెస్ట్ ఆప్ష‌న్. కానీ.. త‌ను కేవ‌లం హిందూపురం ఎమ్మెల్యే కాబ‌ట్టి.. హిందూపురం జిల్లా కావాల‌నే అర్థం లేని డిమాండ్ తో బాల‌కృష్ణ తెర‌పైకి వ‌స్తున్నారు!