మొస‌లి క‌న్నీళ్లు

ఉద్యోగుల ఉద్య‌మాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. అయితే ఉద్య‌మంలోకి రాజ‌కీయ పార్టీల‌కు ఉద్యోగ సంఘాలు నో ఎంట్రీ బోర్డు పెట్ట‌డంతో ఏమీ పాలుపోని ప‌రిస్థితి. అలాగ‌ని రాజ‌కీయ పార్టీలు ప్రేక్ష‌క పాత్ర…

ఉద్యోగుల ఉద్య‌మాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. అయితే ఉద్య‌మంలోకి రాజ‌కీయ పార్టీల‌కు ఉద్యోగ సంఘాలు నో ఎంట్రీ బోర్డు పెట్ట‌డంతో ఏమీ పాలుపోని ప‌రిస్థితి. అలాగ‌ని రాజ‌కీయ పార్టీలు ప్రేక్ష‌క పాత్ర పోషించ‌డం లేదు. మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల‌పై సానుభూతి వ‌చ‌నాలు వ‌ల్లిస్తున్నారు. 

ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌ట్టిన నేప‌థ్యంలో పోలీసుల‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీల‌క పిలుపునిచ్చారు. ఏపీ ప్ర‌భుత్వానికి పోలీసులు స‌హాయ నిరాక‌ర‌ణ చేయాల‌ని ఆయ‌న కోరడం గ‌మ‌నార్హం. ఇవాళ చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని ఉద్యోగులు దిగ్విజ‌యంగా నిర్వ‌ర్తించడాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చ‌లో విజ‌య‌వాడ‌కు వెళుతున్న ఉద్యోగుల‌ను అరెస్ట్ చేయ‌డం స‌బ‌బు కాద‌న్నారు.

ప్ర‌భుత్వానికి స‌హాయ స‌హ‌కారాలు అందించేది ఉద్యోగులే అని ఆయ‌న అన్నారు. ఉద్యోగులేమీ రాజ‌కీయ నాయ‌కులు కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఉద్యోగుల్ని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేష‌న్ల‌కు తీసుకెళ్ల‌డాన్ని త‌మ పార్టీ ఖండిస్తోంద‌న్నారు. పోలీసుల‌కు కూడా పీఆర్సీ వ‌చ్చే విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

ఎన్జీవోల‌ను అరెస్ట్ చేసే విష‌యంలో ప్ర‌భుత్వానికి పోలీసులు స‌హాయ నిరాక‌ర‌ణ చేయాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఉద్యోగులు ఉద్య‌మాలు చేయాల్సిన ప‌రిస్థితిని ప్ర‌భుత్వం తీసుకురావ‌ద్ద‌న్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ఈ ప్ర‌భుత్వాలు ప‌రిష్క‌రించ‌లేవ‌న్నారు. 

క‌నీసం ప్ర‌తినెలా ఉద్యోగుల‌కు స‌రైన స‌మ‌యానికి వేత‌నాలు చెల్లించే ప‌రిస్థితి కూడా లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బు లేద‌ని ఆయ‌న అన్నారు. ఆదాయ మార్గాల‌ను అన్వేషించి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉద్యోగుల డిమాండ్ల‌ను ముఖ్య‌మంత్రి ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

త‌మ ఉద్య‌మంలోకి రాజ‌కీయ పార్టీల‌ను అనుమ‌తించేది లేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా ఉద్య‌మంలోకి చొర‌బ‌డి రాజ‌కీయంగా లాభం పొందాల‌నే ఆశ ఉన్న‌ప్ప‌టికీ, ఉద్యోగ సంఘాల నేత‌ల క‌ట్ట‌డితో ప్ర‌తిప‌క్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉండ‌డం, అధికార పార్టీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్య‌మాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే దారుల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీలు అన్వేషిస్తున్నాయి. 

ఇందులో భాగ‌మే చంద్ర‌బాబు, సోము వీర్రాజు త‌దిత‌ర నాయ‌కులు ఉద్యోగుల‌పై కారుస్తున్న మొస‌లి కన్నీళ్లని చెప్పొచ్చు.