కేసీఆర్ వెంట వైసీపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంట వైసీపీ ఎమ్మెల్యేలు న‌డుస్తూ తెలుగు స‌మాజాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు జ‌గ‌డం గురించి అంద‌రికీ తెలుసు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంట వైసీపీ ఎమ్మెల్యేలు న‌డుస్తూ తెలుగు స‌మాజాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు జ‌గ‌డం గురించి అంద‌రికీ తెలుసు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ స‌ర్కార్ తీరుపై తెలంగాణ పెద్ద‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఏపీ ప్రభుత్వ పెద్ద‌లు కూడా ఎదురు దాడికి దిగారు. ఆ త‌ర్వాత స‌మ‌స్య కేంద్రం కోర్టులోకి వెళ్లింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ మునుప‌టి సంబంధాలే ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య కొన‌సాగుతున్నాయి.

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం ముచ్చింత‌ల్‌కు వెళ్ల‌గా, ఆయ‌న వెంట చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉండ‌డం విశేషం. టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల కంటే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులే కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డాన్ని వివిధ చాన‌ళ్లు ప్ర‌త్యేకంగా ప్ర‌సారం చేశాయి.

ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. చిన్న‌జీయ‌ర్ స్వామితో క‌లిసి స‌మ‌తా మూర్తి కేంద్రంలోని రామానుజాచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను కేసీఆర్ ప‌రిశీలించారు. వీరితో పాటు చెవిరెడ్డి, రోజా కూడా ప‌రిశీలించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  

గ‌తంలో త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ వెళ్లిన సంద‌ర్భంలో… మార్గ‌మ‌ధ్యంలో రోజా ఇంటికి కూడా వెళ్లారు. రోజా ఆతిథ్యాన్ని కేసీఆర్ కుటుంబం స్వీక‌రించింది. ఈ సంద‌ర్భంగా న‌దీ జ‌లాల‌ను ఇరు రాష్ట్రాలు ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పంపిణీ చేసుకుంటాయ‌ని కేసీఆర్ అన్నారు. 

క‌రవు పీడిత ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ‌కు సాగునీళ్లు అందించేందుకు తెలంగాణ అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తుంద‌ని అప్ప‌ట్లో రోజా ఇంట్లో కేసీఆర్ అన్న మాట‌లు… అప్పుడ‌ప్పుడు రాజ‌కీయంగా తెర‌పైకి వ‌స్తుంటాయి. తాజాగా కేసీఆర్ వెంట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నేప‌థ్యంలో …తెలంగాణ ప్ర‌భుత్వంతో ఏపీ సీఎం జ‌గ‌న్ సంబంధాల చ‌ర్చ జ‌రుగుతోంది.