యూపీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందంటూ వివిధ సర్వేలు ఘోషిస్తూ ఉన్నా, ఆ పార్టీకి నేతల రాజీనామాల పరంపర ఆసక్తిదాయకంగా నిలుస్తోంది. ఇప్పటికే ఒక మంత్రి వెళ్లి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో చేతులు కలపగా, మరో మంత్రి కూడా రాజీనామా ప్రకటన చేశారు. వీరు గాక మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా తాము భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నట్టుగా ప్రకటించారు!
మరో నెల రోజుల్లోపే యూపీలో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఈ రాజీనామాల ప్రకటనలు దుమారం రేపుతున్నాయి. వీడుతున్న నేతలు ఒకటే మాట చెబుతున్నారు.. బీజేపీ సర్కారు దళితులు, బలహీనవర్గాలు, రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును వీరు తప్పు పడుతున్నారు. వీరి పట్ల యోగి సర్కారు వ్యవహరిస్తున్న తీరును వీరు తప్పు పడుతున్నారు.
ఇప్పటి వరకూ బీజేపీని వీడిన వారిలో స్వామి ప్రసాద్ మౌర్యను ప్రముఖ నేతగా చెబుతున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన ఈయన కనీసం ఇరవై నియోజకవర్గాలపై పట్టున్న నేత అని మీడియా చెబుతోంది. గత ఎన్నికల సమయంలో బీఎస్పీని వీడి ఈయన బీజేపీలోకి చేరారు. ఆ సమయంలో ఈయన చేరిక బీజేపీకి చాలా లాభం చేకూర్చిందని, ఇప్పుడు ఆయన కమలం పార్టీని వీడటం ఈ పార్టీకి ఝలక్ అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. తను ఎక్కడ ఉంటే అక్కడకు అధికారం వస్తుందని అంటున్నాడు! ఈయన కూతురు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారంటే, రాజకీయంగా ఈయన బలాన్ని అంచనా వేయవచ్చు. స్వామి ప్రసాద్ మౌర్యకు మద్దతుగా ఇప్పటి వరకూ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
ఇక యోగి మంత్రివర్గంలోని మరో సభ్యుడు దారాసింగ్ చౌహాన్ కూడా రాజీనామా ప్రకటించారు. వీరు గాక మరో నలుగురు ఎమ్మెల్యేలు.. స్థూలంగా ఆరు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి దూరం అవుతున్నట్టుగా ప్రకటించారు.
అయితే ఈ కౌంట్ ఇంతటితో ఆగదనే మాట కూడా వినిపిస్తూ ఉంది. బీజేపీ వ్యతిరేక వర్గాల అంచనా ప్రకారం కనీసం ఇరవై మంది ఎమ్మెల్యేలు అతి త్వరలో బీజేపీని వీడవచ్చని అంచనా! స్వామి ప్రసాద్ మౌర్య ఇరవై మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
రాజకీయ నేతల వలసలు ఎప్పుడూ అధికారం ఎటువైపుకో.. అటు వైపుకు.. అన్నట్టుగా ఉంటాయి. మరి యూపీలో అధికారంలో ఉన్న బీజేపీని వీడి, ఎన్నికల ముందు ఎస్పీ వైపుకు ఈ వలసలు సాగడం.. ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టుందే!