దీర్ఘకాలిక లక్ష్యాలతో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అతి స్వల్ప కాలంలోనే ఫలితాలను చూపెడుతున్నాయి. విద్యారంగంలో భారీ మార్పు కోసం తీసుకొచ్చిన సంస్కరణలు ఏడాదిన్నర కాలంలోనే తిరుగులేని రిజల్ట్ ఇచ్చాయి. సీఎంఓ కార్యాలయం విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లో అడ్మిషన్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగింది.
2019లో ప్రభుత్వ స్కూళ్లలో 39.78 లక్షలమంది విద్యార్థులు చదువుకుంటుండగా.. ఈ ఏడాది కరోనా ప్రభావం ఉన్నా కూడా ఆ సంఖ్య 42.46 లక్షలకి చేరింది. అంటే ఏడాది తిరిగే లోగా 2.68 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు సంపాదించారు. వీరిలో 2,01,833 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు షిఫ్ట్ కావడం చెప్పుకోతగ్గ విషయం.
గతంలో ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రతి ఏడాదీ టీసీ తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది, వీటికి తోడు డ్రాపవుట్స్ అదనం. దీంతో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్యే ఎక్కువగా ఉన్న పాఠశాలల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ జగన్ రాకతో ఈ వ్యవహారం తారుమారైంది.
కాంట్రాక్ట్ పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు మిగులు సాధించిన సీఎం… విద్యార్థులు-తల్లిదండ్రుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రైవేట్ నుంచి ప్రభుత్వం వైపు రివర్స్ జాయినింగ్ ని విజయవంతం చేస్తున్నారు.
జగనన్న అమ్మఒడి..
పిల్లల్ని బడికి పంపించే తల్లికి ప్రతి ఏటా 15వేల రూపాయలు అందించే పథకం ఇది. ప్రభుత్వ, ప్రైవేట్ రెండు స్కూల్స్ కి ఈ పథకం అమలు చేస్తున్నా కూడా.. రాబోయే రోజుల్లో కేవలం ప్రభుత్వ స్కూళ్లకే ఇది పరిమితం అవుతుందనే ప్రచారంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అట్నుంచి ఇటు మార్చేశారు.
జగనన్న విద్యాకానుక
ప్రైవేట్ స్కూల్స్ లో వేలకు వేలు ఫీజులు కట్టించుకుని కూడా పుస్తకాలు ఉచితంగా ఇవ్వరు. తాము చెప్పిన చోటే బ్యాగు, బెల్ట్.. అన్నీ కొనుక్కోవాలి. కానీ జగన్ సర్కారు.. అమ్మఒడి పేరుతో విద్యార్థులకు డబ్బులు ఇస్తూ.. ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూస్.. యూనిఫామ్ క్లాత్ అన్నీ ఇస్తోంది. విద్యాకానుక పేద, మధ్యతరగతి వర్గాలపై బ్రహ్మాండంగా పనిచేసింది.
రేపో మాపో ఇంగ్లిష్ మీడియం..
ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలున్నా.. రేపో మాపో ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వస్తాయనే నమ్మకం తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే ఇంగ్లిష్ మీడియం చదువు కోసమే ప్రైవేట్ స్కూళ్లకు పంపించే కూలీనాలీ ప్రజలు, మధ్యతరగతి వర్గాలు.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ల వైపు దృష్టి మళ్లించాయి.
చివరిగా నాడు-నేడు
కూలిపోయే గోడలు, అపరిశుభ్ర వాతావరణం, టాయిలెట్స్ లేకపోవడం ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్లలో కామన్ గా కనిపించే సమస్యలు. నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలన్నిటినీ మార్చేసింది జగన్ సర్కారు. అప్పుడు-ఇప్పుడు పోల్చి చూస్తే ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఈ పని అసలు ఎందుకు చేయలేదా అనే ఆశ్చర్యం కలగక మానదు.
వీటన్నిటితో ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మారాయి. 2లక్షలకు పైగా ప్రైవేట్ దోపిడీకి బలవుతున్న విద్యార్థులకు విముక్తి కలిగించాయి. విద్యారంగంలో ప్రైవేట్ మాఫియాపై గతంలో చాలామంది నాయకులు ప్రసంగాలకే పరిమితమయ్యారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ సెక్టార్ కి కొమ్ముకాసింది. ప్రభుత్వ చదువుని పూర్తిగా నీరుకార్చింది.
కానీ సీఎం జగన్, ప్రభుత్వ స్కూళ్లలో వసతులు పెంచి పరోక్షంగా కార్పొరేట్ దోపిడీపై చావుదెబ్బ కొట్టారు. దీని ఫలితమే 2లక్షల న్యూ అడ్మిషన్స్. ఇదే కొనసాగితే.. విద్యా వ్యవస్థ తీరుతెన్నుల్ని మార్చిన ఘనుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. ఆరోజు ఇంకెంతో దూరం లేదు.