సమీక్ష: మిడిల్‍ క్లాస్‍ మెలొడీస్‍

సమీక్ష: మిడిల్‍ క్లాస్‍ మెలొడీస్‍ రేటింగ్‍: 2.75/5 బ్యానర్‍: భవ్య క్రియేషన్స్ తారాగణం: ఆనంద్‍ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, తరుణ్‍ భాస్కర్‍ తదితరులు…

సమీక్ష: మిడిల్‍ క్లాస్‍ మెలొడీస్‍
రేటింగ్‍: 2.75/5
బ్యానర్‍:
భవ్య క్రియేషన్స్
తారాగణం: ఆనంద్‍ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, తరుణ్‍ భాస్కర్‍ తదితరులు
కథ, మాటలు: జనార్ధన్‍ పసుమర్తి
కథనం: జనార్ధన్‍ పసుమర్తి, వినోద్‍ అనంతోజు
నేపథ్య సంగీతం: విక్రమ్‍ ఆర్‍.హెచ్‍.
సంగీతం: స్వీకర్‍ అగస్తి
కూర్పు: రవితేజ గిరిజాల
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాత: వెనిగళ్ల ఆనంద్‍ ప్రసాద్‍
దర్శకత్వం: వినోద్‍ అనంతోజు
విడుదల తేదీ: నవంబరు 20, 2020
వేదిక: అమెజాన్‍ ప్రైమ్‍ వీడియో

మధ్య తరగతి మధురిమలు… అనే పేరులోనే దర్శకుడి ఉద్దేశం స్పష్టమవుతుంది. ఒక సినిమా కథ చెప్పడం కంటే కొందరి జీవితాలలోని సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. మొట్టమొదటి సన్నివేశంలోనే గృహప్రవేశ ఘట్టంలో ఆవు పేడ వేయడం కోసం ఒక కుటుంబం సహనంతో నిరీక్షిస్తుంటుంది. ఆ తదుపరి సన్నివేశంలో తాను చేసే బొంబాయ్‍ చట్నీ చాలా ఫేమస్‍ అని భావించే కథానాయకుడి పరిచయం జరుగుతుంది. ఈ కథ సదరు హీరో తన చట్నీతో ఎలా ఫేమస్‍ అయ్యాడనే దానిగురించి కాదు… ఆవు పేడ వేయడం కోసం ఎదురు చూసిన మధ్య తరగతి జీవితాల్లోని కొన్ని పుటల గురించి. 

క్రికెటర్‍ అయిపోవాలనో, లేదా అద్భుతం ఏదైనా చేయాలనో మన హీరో అనుకోడు. అతడిదో చిన్న ఆశ. పల్లెటూరిలో వున్న తన టిఫిన్‍ సెంటర్‍ని పక్కనే వున్న గుంటూరు టౌనుకి షిఫ్టు చేస్తే ఆదాయం పెరుగుతుందని అతడి నమ్మకం. సందుకో హోటల్‍ వున్న చోట తాను చేసే బొంబాయ్‍ చట్నీ తనను ఫేమస్‍ చేస్తుందని బలంగా నమ్ముతాడు. అతని కథ అలా వుంటే… తన వెంటే తిరిగే తన స్నేహితుడిది మరో కథ. పల్లెటూళ్లో మొబైల్‍ ఫోన్స్ సర్వీస్‍ సెంటర్‍ పెట్టి జీవితంలో చాలా సక్సెస్‍ అయిపోయాననుకునే అతగాడికి జాతకాల పిచ్చి. తనకు నచ్చిన అమ్మాయి ఎదురు పడితే ముందుగా తన డేట్‍ ఆఫ్‍ బర్త్, టైమ్‍ అడిగి తెలుసుకుని, జాతకాలు మ్యాచ్‍ అవలేదంటూ ఆమెపై ఇష్టాన్ని పక్కన పెట్టేస్తాడు. 

తన కొడుకు ఎందుకూ పనికి రాడని ఫిక్సయిపోయిన హీరో తండ్రి.. కొడుకు పెట్టుకుంటానంటున్న హోటల్‍ కోసం ఉన్న పొలాన్ని కూడా అమ్మేస్తాడు. సగటు మధ్య తరగతి తండ్రిలా దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియని అన్‍ప్రిడిక్టబుల్‍ నేచర్‍ ఈ క్యారెక్టర్‍ను సినిమాకు హైలైట్‍గా నిలబెట్టింది. గోపరాజు రమణ ఈ పాత్రకు జీవం పోయడమే కాదు… తాను కనిపించిన ప్రతి సన్నివేశాన్నీ ఎంజాయ్‍ చేసేంత వినోదాత్మకంగా నటించాడు. కేవలం కథానాయకుడి పాత్ర మాత్రమే కాకుండా సహాయ పాత్రలకు కూడా ఒక సబ్‍ప్లాట్‍ వుండడం… అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ నడిపించడం ఈ చిత్రంలోని మరో ప్రత్యేకత. 

గుంటూరు జిల్లాలోని పల్లె జీవితాలను, అక్కడి జీవన సరళిని చక్కగా చూపించారు. మధ్య తరగతి కష్టాలెలా వుంటాయనేది డ్రామా లేకుండా సహజంగా తెరమీదకు తెచ్చారు. కాకపోతే ఈ మధురిమలన్నీ తొలి సగానికే పరిమితమయి, ద్వితియార్ధంలో కథనం నత్త నడక నడవడంతో ‘మెలొడీ’ కూడా కాస్త చేదనిపిస్తుంది. హీరో హూటల్‍ పెట్టుకున్నాక ఎదురయ్యే సంఘటనలు కానీ, హీరో హీరోయిన్ల పెళ్లి తంతు విషయంలో సాగతీత ధోరణి కానీ… హీరో బొంబాయ్‍ చట్నీలో మిస్‍ అయిన ‘సీక్రెట్‍ ఇన్‍గ్రీడియంట్‍’ మాదిరిగా ఇక్కడ దర్శక, రచయితలకు మరేదైనా స్ట్రయికింగ్‍ ఎలిమెంట్‍ దొరక్కుండా పోయిందనిపిస్తుంది. 

ఆనంద్‍ మొదటి సినిమా కంటే మెరుగైన నటన కనబరిచాడు కానీ గుంటూరు జిల్లా యాస మాట్లాడ్డంపై కృషి చేసినట్టయితే బాగుండేది. వర్ష బొల్లమ్మ మాటలెక్కువ అవసరం లేకుండానే హావభావాలు పలికించింది. ముందే చెప్పినట్టు గోపరాజు రమణ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచింది. సురభి ప్రభావతి, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద తదితరుల సహజ నటన ఈ చిత్రానికి వాస్తవికతను తీసుకొచ్చింది. పాటలు ఏమంత వినసొంపుగా లేకపోయినా కానీ నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా ఈ చిత్రానికి సహజత్వాన్ని జోడించడంలో దోహదపడ్డాయి. 

ఈ చిత్ర రచయిత జనార్ధన్‍ సహజ సంభాషణలతో ఆకట్టుకున్నాడు. సినీ ఫక్కీలో సంభాషణలు రాయడం కాకుండా అచ్చమైన పల్లె బ్రతుకులను తన మాటలతో ఆవిష్కరించాడు. దర్శకుడు వినోద్‍ అనంతోజు అటు వినోదమయినా, ఇటు ఎమోషన్‍ అయినా బ్యాలెన్స్ తప్పకుండా, ఎక్కడా మోతాదు మించకుండా జాగ్రత్త పడ్డాడు. కాకపోతే హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ సన్నివేశాల విషయంలో తగినంత శ్రద్ధ చూపించలేదు. అలాగే కొన్ని సన్నివేశాలను సుదీర్ఘంగా సాగదీస్తూ, కొన్ని అంశాలను పదే పదే రిపీట్‍ చేస్తూ మధ్యలో విసిగించాడు. పతాక సన్నివేశాల్లో వినోదం కోసం చేసిన ప్రయత్నంలో కూడా మిశ్రమ ఫలితాన్ని మాత్రమే సాధించాడు. 

కొన్ని సమస్యలయితే వున్నాయి కానీ ఓటిటిలో కాలక్షేపానికి వీక్షించడానికి కావాల్సిన వినోదంతో పాటు పాత్రలు, సంఘటనలతో రిలేట్‍ చేసుకోగలిగే సహజత్వం ‘మిడిల్‍ క్లాస్‍ మెలొడీస్‍’ను వన్‍ టైమ్‍ వాచ్‍గా నిలబెడుతుంది. ద్వితియార్ధంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి, హీరో హీరోయిన్ల లవ్‍ ట్రాక్‍కి కూడా తగినంత ప్రాధాన్యం ఇచ్చినట్టయితే ఈ చిత్రం క్లాస్‍ మరింత పెరిగివుండేది. 

బాటమ్‍ లైన్‍: ఇంటింటి రామాయణం!