నాయకుల మరణం కారణంగా వచ్చే ఉప ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం ఆనవాయితీ. అదే సమయంలో ఏకగ్రీవానికి సహకరించడం కూడా ఇతర పార్టీలు గౌరవంగా భావిస్తాయి. అయితే చంద్రబాబు ఈ ఆనవాయితీని తుంగలో తొక్కి చాలాసార్లు చావుదెబ్బ తిన్న ఉదాహరణలున్నాయి. తాజాగా ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వస్తోంది.
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో వస్తున్న ఈ ఉప ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. 2019లో పోటీ చేసిన మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టికెట్ ఖరారు చేసింది. అయితే పనబాక వర్గం నుంచి ఇంకా ప్రచార ఆర్భాటాలు ప్రారంభం కాకపోవడం విచిత్రం. ఇక అధికార వైసీపీలో ఇంకా అంతర్మథనం కొనసాగటం మరీ విచిత్రం.
బల్లి దుర్గా ప్రసాద్ చివరి నిముషంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకుని ఘన విజయం సాధించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో కుమారుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి కాస్తో కూస్తో ప్రజల్లో తిరుగుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. తండ్రి మరణం తర్వాత తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలసి తనకు మద్దతు తెలపాలని కోరారు.
అయితే సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒకవేళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే ఆలోచనే ఉంటే.. దానికి ఇన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదని, ఆ దిశగా జగన్ ఆలోచన చేయకపోవడం వల్లే అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కూడా అసంపూర్ణంగానే ముగిసింది.
మంత్రులు, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన జగన్.. అభ్యర్థి విషయంపై ఆరా తీయగా.. ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. చివరకు అభ్యర్థి ఎంపిక బాధ్యతను కూడా సీఎం జగన్ కి అప్పగిస్తూ తీర్మానం చేసుకున్నామని బైటకొచ్చి మీడియాకి చెప్పేశారు. మీ నిర్ణయమే మాకు శిరోధార్యం, ఎవరిని అభ్యర్థిగా పెట్టినా భారీ మెజార్టీతో గెలిపించుకుని వస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.
అంటే ఒక రకంగా దుర్గాప్రసాద్ కుటుం సభ్యులకు అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. అభ్యర్థిని ఖరారు చేయలేదు కానీ.. ఎన్నికలకు సమాయత్తమయ్యే కార్యక్రమాన్ని మాత్రం జగన్ మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంచార్జి మంత్రిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని, మండలానికి ఒక కీలక నేతను బాధ్యులుగా చేయాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారని తెలుస్తోంది.
ఏర్పాట్లు బాగున్నాయి కానీ, అభ్యర్థిని ప్రకటించడంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారనే విషయమే సస్పెన్స్ గా మారింది.