ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ఓపెన్ చేయగానే…కుడి వైపు చతురస్రాకారంలో రౌండ్ ది క్లాక్ తిరుగుతూ కనిపిస్తుంది. ఆ క్లాక్ పైన కోవిడ్-19 అని ఉంటుంది. దాని కింద మన దేశంతో పాటు తెలంగాణలో నమోదైన కరోనా కేసులు, చనిపోయిన వారి సంఖ్య, బాగైన వారి సంఖ్య తదితర వివరాలుంటాయి. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా కేసులు, ఇతరత్రా వివరాల కోసం సహజంగానే ఆసక్తిగా ఎదురు చూస్తాం. కానీ నిమిషాలు, గంటలు గడిచినా అందులో ఆంధ్రప్రదేశ్ వివరాలు ఏ మాత్రం కనిపించవు. అంటే ఆంధ్రజ్యోతికి ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతటి చులకన భావనో ఈ ఒక్క అంశమే తెలియజేస్తుంది.
కానీ ఉన్నది లేనిది కల్పించి బురద చల్లడానికి మాత్రం ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఆంధ్రప్రదేశ్ కావాలి. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నది తనకు ఎంత మాత్రం గిట్టని వైఎస్ జగన్మోహన్రెడ్డి కాబట్టి. జగన్‌పై అక్కసుతో ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని ఆర్కే కోరుకుంటున్నాడు.
కరోనా వైరస్ దూసుకొస్తూ తీవ్ర విధ్వంసం సృష్ఠిస్తుంటే, ఒక మీడియా సంస్థగా జనంలో మనో స్థైర్యం కల్పించాల్సిన ఆర్కే…ఆ పని విడిచి పెట్టాడు. అంతటితో ఊరుకుంటే నష్టమేమీ లేదు. కరోనా వైరస్‌కు తాను కూడా తోడయ్యాడు. అగ్గికి గాలి తోడైనట్టు ఆంధ్రప్రదేశ్ వినాశనానికి కరోనాతో ఆర్కే జత కలిశాడు.
కరోనా విపత్తు నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వాయిదాల్లో వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఏపీ సర్కార్ నిర్ణయం ఆర్కే దృష్టిలో తీవ్ర తప్పిదమైంది. ‘వాయిదాల్లో వేతనం!’ శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనం రాసింది. ఈ కథనానికి వాడిన ఉప శీర్షికలను గమనిస్తే…ఆర్కే వక్రబుద్ధి, కుట్ర మనస్తత్వం అర్థమవుతుంది. నిధులున్నా తెలంగాణ తరహాలో నిర్ణయం; ఆ సొమ్ముతో అత్యవసర చెల్లింపులు?; రూ.వెయ్యి ఇచ్చేందుకు రూ.1300 కోట్లు అనే సబ్ హెడ్డింగ్స్‌తో కథనాన్ని రాసుకెళ్లారు.
ఒక వైపు ఆంధ్రప్రదేశ్ సర్కార్ వద్ద నిధులున్నా కావాలనే తెలంగాణ తరహాలో ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధించిందని, వాయిదాల పద్ధతిలో చెల్లించాలని నిర్ణయించిందని రాయడం ద్వారా…జగన్ సర్కార్‌పై ఉద్యోగుల వ్యతిరేకత పెంచడమే ఆంధ్రజ్యోతి ప్రధాన ఉద్దేశం. పేదలకు రూ.వెయ్యి ఇవ్వడం కూడా ఆంధ్రజ్యోతికి, ఆర్కేకు ఎంత మాత్రం ఇష్టం లేనట్టుంది. అలాగే అత్యవసర చెల్లింపులకు కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోవడం కూడా వీళ్ల దృష్టిలో జగన్ సర్కార్ చేస్తున్న తీవ్రమైన నేరం.
ఇదే కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధిస్తే…కోతలు ఖరారు శీర్షికతో తెలంగాణ ఎడిషన్‌లో మంగళవారం బ్యానర్ వార్త ఇచ్చారు. ఇక కథనం విషయానికి వస్తే….
‘కరోనా వైరస్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొంది. ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో భారీగా కోత పెట్టింది’ ….అని మొదలు పెట్టి వార్తను కొనసాగించారు. కేసీఆర్ అంటే ఎలాంటి భయభక్తులున్నాయో…ఈ ఒక్క వాక్యం చదివితే చాలు అర్థం చేసుకోవచ్చు. దేవునికైనా దెబ్బే గురువు అనే చందంగా కేసీఆర్ అంటే ఆర్కేతో పాటు తెలంగాణలోని అన్ని మీడియా సంస్థల యజమానులకు కలలో కూడా భయమే. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని తెలంగాణలో మీడియా వ్యవహరిస్తుంది.
ఇదే ఆంధ్రా విషయానికి వస్తే…తమను జగన్ ఏమీ చేయలేడనే చులకన భావం. అగ్గికి ఆజ్యం(నెయ్యి) తోడైనట్టు…కరోనాకు ఆర్కే తోడయ్యాడు. అందుకే ఉద్యోగుల వేతనాలతో పాటు వలంటీర్ల వ్యవస్థపై విషపు రాతలు రాయగలిగారు.