కరోనా ఎఫెక్ట్ తో రాజకీయ నాయకులందరూ సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు, లోకేష్ కూడా సోషల్ మీడియాలో తమ ప్రతాపం చూపించాలనుకున్నా కుదరట్లేదు. జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. కరోనా టైమ్ లో సక్సెస్ అయ్యారు.
కరోనాపై పోరు కోసం 2కోట్ల రూపాయల సాయం చేసినప్పుడే పవన్ పెద్దమనసుకి అందరూ ఫిదా అయ్యారు. అక్కడితో ఆగకుండా.. సాయం చేస్తున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించడం, వారి గురించి ట్వీట్ వేయడం.. పవన్ సింప్లిసిటీని మరింతగా హైలెట్ చేశాయి. తెలుగువారి కష్టాలపై కూడా పవన్ పడుతున్న తాపత్రయం చాలామందిని ఆలోచింపచేసింది.
తమిళనాడులో చిక్కుకున్న జాలర్లను రక్షించే దిశగా పవన్ సూచనలకు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి స్పందించడం, వెంటనే ఏపీ జాలర్లకు సహాయం చేసి, పవన్ పేరుని మెన్షన్ చేస్తూ ట్వీట్ వేయడంతో జనసేనాని ఇమేజ్ మరింత పెరిగింది. చెన్నై కార్పొరేషన్ కూడా పవవ్ ట్వీట్ పై స్పందించడం విశేషం.
లాక్ డౌన్ కారణంగా కర్నూలుకు చెందిన 500 రోజువారీ కార్మిక కుటుంబాలు ముంబయి సరిహద్దుల్లో చిక్కుకుపోతే.. వాళ్లను కాపాడమంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి పవన్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తిచేశారు. దీనిపై వెంటనే మహారాష్ట్ర సర్కార్ రియాక్ట్ అవ్వడం, పవన్ తిరిగి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పడం లాంటివి సోషల్ మీడియాలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
తాజాగా ఉద్యాన పంటల రైతుల కష్టాలు, ఆక్వా రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వానికి కూడా కొన్ని విన్నపాలు పంపించారు పవన్ కల్యాణ్. వాలంటీర్ వ్యవస్థని ప్రశంసిస్తూ.. రేషన్ సరకులు ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మొత్తమ్మీద రైతులు, కార్మికుల కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ.. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు పవన్.
23 స్థానాలు గెలుచుకున్న టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా విఫలమైన వేళ, పవన్ కల్యాణ్ మాత్రం ఇలా ట్విట్టర్ వేదికగా జన హృదయాలను గెలుచుకున్నారు.