మాటకున్న పదును దేనికీ ఉండదు. అందుకే మాటలు బాకుల్లా గుచ్చుకున్నాయని కొందరు బాధ పడుతుంటారు. మన విషయంలో ఎదుటి వాళ్లు ఎలా ఉండాలని ఆశిస్తామో…మనం కూడా ఎదుటి వారి విషయంలో అదే వైఖరితో మెలగాలి. అప్పుడే సమాజంలో ఆరోగ్యకర వాతావరణం నెలకుంటుంది.
కొందరిని కొన్ని మాటలు జీవితాంతం నీడలా వెంటాడుతుంటాయి. హీరోయిన్ అంజలిని కూడా కొంత మంది మాటలు తీవ్ర మనస్తాపం కలిగించాయి. అందుకే తనను ప్లాప్ అయిన సినిమాల కంటే …కొందరి ఎత్తి పొడుపు మాటలు మనసుకు గుచ్చుకున్నాయని తెగ బాధపడుతున్నారామె.
ఒకప్పుడు టాలీవుడ్‌లో సీతమ్మగా దివంగత అంజలీదేవి గుర్తింపు పొందారు. ఆమె తర్వాత ఆ స్థాయిలో సీతమ్మగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న హీరోయిన్ అంజలి అంటే అతిశయోక్తి కాదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రం ద్వారా సీతగా తెలుగు సమాజానికి అంజలి పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయం సాధించినా, తెలుగులో ఆమె రాణించలేకపోయారు.
ఇటీవల ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సహజంగానే సీతమ్మగా పిలిపించుకుంటున్న అంజలిని సందర్భోచితంగా… ఆనాటి సీత బాధపడినట్లు..చిత్ర పరిశ్రమలో మీరెప్పుడైనా బాధపడ్డారా? అనే ప్రశ్నవేశారు.
దీనికి ఆమె సమాధానమిస్తూ… ‘భగవంతుని దయ వల్ల నా సినిమాలన్నీ మినిమమ్ గ్యారంటీతో ఆడినవే! సినిమాల పరంగా ఎప్పుడూ బాధపడలేదు. కానీ గతంలో మా కుటుంబంలో కొన్ని సమస్యలు చర్చనీయాంశమయ్యాయి. మా కుటుంబ విషయాలు అందరి నోళ్ళల్లోనూ బాగా తిరగాడాయి. ఆ సమయంలో నన్ను ఓదార్చినవారి కన్నా, నా పనైపోయిందని హేళన చేసిన వాళ్లే ఎక్కువ. నాతో సన్నిహితంగా ఉండేవారు కూడా అలాంటి మాటలు మాట్లాడడం నాకు మరింత ఆవేదన కలిగించింది’ అని అంజలి బదులిచ్చారు.