1610.. ఇదీ దేశంలో కరోనా కేసుల తాజా నంబర్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ సమీపంలో మసీదులో ప్రత్యేక ప్రార్థనల చోట కరోనా వైరస్ తీవ్రంగా అంటుకోవడం, అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్న వారు సొంత ప్రాంతాలకు వెళ్లాకా అసలు కథ బయటకు రావడంతో… కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కాస్తా నియంత్రణలో ఉన్నట్టుగానే అగుపించింది. అయితే ఎప్పుడైతే ఈ ప్రత్యేక ప్రార్థనల వాళ్లకు కరోనా సోకిందనే విషయం నిర్ధారణ అయ్యిందో అక్కడ నుంచినే కథ మారిపోయింది. వాళ్లంతా మార్చి 23 సమయంలో దేశ వ్యాప్తంగా తమ స్వస్థలాలకు ప్రయాణాలు చేశారు. ఆ ప్రయాణాలు రైళ్లు, బస్సుల్లోనే ప్రధానంగా చేశారు. ఆ తర్వాత సొంతూళ్లలో తిరిగారు.
ఈ నేపథ్యంలో వీళ్లలో ఎంత మంది కరోనా బారిన పడ్డారు, వారు ఎంతమందికి ఆ వైరస్ ను అంటించారనేది అంతుబట్టని వ్యవహారంగా మారింది. ఆ ప్రార్థనలకు అటెండ్ అయిన వారు ఎవరెవరో పట్టుకుని, వారికి పరీక్షలు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన పరీక్షగా మారింది. అది కూడా ఆ ప్రార్థనలకు హాజరైన వారి సంఖ్య వేలల్లో ఉంది! ఈ నేపథ్యంలో.. వారిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారు, వారు ఎంతమందికి ఆ వ్యాధిని అంటించి ఉంటారనేది మిస్టరీగా మారింది!
మరో వారం రోజులు గడిస్తే కానీ.. వాళ్ల విషయంలో పూర్తి స్పష్టత రాకపోవచ్చు. అయితే వీరు ఈ ప్రయాణాల్లో మరెంతమందికి అంటించారో, సొంతూళ్లలో తిరుగుతూ ఇంకెంత మందికి అంటించారో అనేది ఊహించడానికి కూడా ఇప్పుడు అంతుబట్టని అంశమే. ఢిల్లీ ప్రత్యేక ప్రార్థనల్లో అంటుకున్న కరోనా జాడ్యంతో దేశం ఒక్కసారి ఇప్పుడు పూర్తి డిఫెన్స్ మూడ్ లోకి వెళ్లిపోయింది. నిన్నమొన్నటి వరకూ ఏదో మొండి ధైర్యంతో కాస్త బయటకు వచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు కాలు బయటపెట్టలేని పరిస్థితి.