బాబుతో ఆర్కే చెల‌గాటం

ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ఎండీ ఆర్కే వారం వారం రాసే కొత్త ప‌లుకు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌పై విద్వేషానికి ప్ర‌తీక‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తారు. ఒక ప‌త్రికాధిప‌తిగా, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ఈ స్థాయిలో రాజ‌కీయ రంగు…

ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ఎండీ ఆర్కే వారం వారం రాసే కొత్త ప‌లుకు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌పై విద్వేషానికి ప్ర‌తీక‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తారు. ఒక ప‌త్రికాధిప‌తిగా, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ఈ స్థాయిలో రాజ‌కీయ రంగు పులుముకుని, య‌థేచ్ఛ‌గా అక్ష‌రాన్ని వ‌క్ర‌మార్గం ప‌ట్టించిన దాఖ‌లాలు లేవ‌నే అభిప్రాయాలు జ‌ర్న‌లిస్టు స‌ర్కిల్‌లో బ‌లంగా ఉన్నాయి. 

బ‌హుశా జ‌గ‌న్‌పై ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుకు కూడా ఆర్కే స్థాయి అక్క‌సు ఉంటుంద‌ని అనుకోలేం. అయితే ఆర్కే రాత‌ల‌తో జ‌గ‌న్‌కు ఎలాంటి న‌ష్టం లేదు. ఎందుకంటే కొత్త ప‌లుకులో త‌న‌కు అనుకూలంగా ఆర్కే రాస్తే …జ‌గ‌న్ త‌న‌ను తాను ఒక్క‌సారి ప‌రిశీలించుకోవాల్సి ఉంటుంది.  

జ‌గ‌న్‌కు త‌న శ‌త్రువులెవ‌రో, మిత్రులెవ‌రో తెలిసిపోవ‌డం వ‌ల్ల రిలాక్స్‌గా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే అస‌లు స‌మ‌స్య‌. కింద ప‌డినా అదో ల‌గువు అన్నచందంగా ఒక వైపు చంద్ర‌బాబు రోజురోజుకూ ప్ర‌జాద‌ర‌ణ కోల్పోతున్నా… వీరుడు శూరుడు అంటూ కీర్తించే ఆర్కే బాప‌తు రాత‌ల వ‌ల్ల న‌ష్ట‌మే త‌ప్ప లాభం లేద‌నేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం.

జ‌గ‌న్‌పై అక్క‌సుతో ఒక్కోసారి ఆర్కే వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుకు, అలాగే టీడీపీకి తీవ్ర‌స్థాయిలో న‌ష్టం క‌లిగించే రాత‌ల‌ను రాస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏ విధంగా ఉంటాయో ఆంధ్య‌”జ్యోతి”ష్యుడైన ఆర్కే ముచ్చ‌ట‌గా మూడేళ్లు ముందుగానే ప్ర‌క‌టించడం విశేషం. ఆర్కే నిజంగా చంద్ర‌బాబు ఆరాధ‌కుడు, టీడీపీ శ్రేయోభిలాషి అయితే తిరుప‌తిలో అధికార పార్టీ దురాగ‌తాల గురించి కాదు చెప్పాల్సింది.

తిరుప‌తిలో అధికార పార్టీ య‌థేచ్ఛ‌గా దొంగ ఓట్లు వేసుకుంటుంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ ఎదుర్కోవ‌డంలో ఎందుకు విఫ‌ల‌మైందో, లోపాలెక్క‌డో చెప్పి ఉంటే తాను అభిమానించే నేత‌కు, పార్టీకి ప్ర‌యోజ‌న‌కారిగా ఉండేది. అలా కాకుండా తిరుప‌తిలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వేసిన ట్రైల్ స‌క్సెస్ అయ్యింద‌ని, రానున్న ఎన్నిక‌ల్లో అదే ప్ర‌యోగిస్తార‌ని చెప్ప‌డం ద్వారా …స‌మాజానికి, టీడీపీ శ్రేణుల‌కు ఎలాంటి సంకేతాలు, సందేశాలు ఇస్తున్నారో ఎల్లో జ‌ర్న‌లిజానికి ఆద్యుడైన ఆర్కే ఆలోచించారా?

“తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో అధికారికంగా రిగ్గింగ్‌ జరిగింది. పొరుగు నియోజక వర్గాల నుంచి వేలాది మందిని బస్సులు, ఇతర వాహనాలలో తరలించి మరీ రిగ్గింగ్‌ చేసిన ఘనత అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది. తిరుపతిలో దురాగతాల పుణ్యమా అని జగన్‌రెడ్డి నిజస్వరూపం బయటపడింది. నిజం చెప్పాలంటే తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా జగన్‌రెడ్డి ఒక ప్రయోగం చేశారు. దొంగఓటర్ల దండయాత్ర విజయవంతం అయింది కనుక మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో విస్తృత ప్రాతిపదికన ఇదే ప్రయోగం చేయరన్న గ్యారంటీ ఏమీ లేదు”

“కేంద్రప్రభుత్వ పెద్దలకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై పీకల దాకా కోపం ఉన్నందున ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ తరహాలో రాష్ట్రంలో కూడా మూడు నాలుగు దశల పోలింగ్‌కు జగన్‌రెడ్డి ప్లాన్‌ చేయరన్న గ్యారంటీ లేదు. జగన్‌ను తమ ఆప్తమిత్రుడుగా కేంద్ర పెద్దలు పరిగణిస్తున్నందున ఆయన కోరికను వారు కాదనగలరా?”

తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధ‌లో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిలో ఒక్క తిరుప‌తిపైనే విమ‌ర్శ‌ల‌న్నీ. ఆర్కే అంటున్న‌ట్టు తిరుప‌తిలో వైసీపీ దొంగ ఓట్ల దండ‌యాత్ర చేస్తుంటే… అడ్డుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీకి లేదా? ఒక్క పోలింగ్ బూత్‌లోనైనా దొంగ ఓట్ల‌ను ఏజెంట్లు అడ్డుకున్న దాఖ‌లాలు ఉన్నాయా? ఇలా ఎందుకు జ‌రిగిందో టీడీపీ క‌నీసం ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటోందా? ఆ దిశ‌గా క‌నీసం ఆర్కే లాంటి వాళ్లైనా ఆలోచిస్తున్నారా? చంద్ర‌బాబును అప్ర‌మ‌త్తం చేసే రాత‌లు రాస్తున్నారా?

ఎంత‌సేపూ అధికార పార్టీని, జ‌గ‌న్‌ను తిట్ట‌డం వ‌చ్చే లాభం ఏంటి?  టీడీపీ త‌న లోపాల‌ను స‌రిదిద్దుకునేదెప్పుడు? స్థానిక టీడీపీ నేత‌ల లోపాయికారి స‌హ‌కారం లేనిదే వైసీపీ దొంగ ఓట్లు వేసుకుందా? ఈ విష‌యం స్థానిక ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని ఆర్కే అనుకుంటున్నారా? ప్ర‌జ‌స్వామ్య‌న్ని హ‌న‌నం చేయ‌డంలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దొందు దొందే అని అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది.

వైసీపీ, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంచి చెడ్డ‌ల‌తో ఆర్కేకు బాధ ఎందుకు? జ‌గ‌న్ ఏం చేసినా దుర్మార్గంగానే క‌దా ఆర్కేకు, చంద్ర‌బాబుకు క‌నిపించేది? ఉదాహ‌ర‌ణ‌గా ఇదే వ్యాసంలో ఆర్కే ఆణిముత్యాల గురించి రెండు మాట‌లు చెప్పుకుందాం.

“ఈ ఉపఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు ఓటర్లకు డబ్బు పంచకపోవడం శుభపరిణామం. ఓటర్లకు డబ్బు పంచకూడదని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, రిగ్గింగ్‌ను కూడా నివారించి ఉంటే ఆయన ప్రతిష్ఠ ఎంతో పెరిగి ఉండేది. రాజకీయా లకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఖ్యాతి దక్కేది” అని రాసుకొచ్చారు. వాస్త‌వాల‌ను రాసిన ఆర్కే అభినంద‌నీయులు.

కానీ ఇదే ఆంధ్ర‌జ్యోతి చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్‌లో ఎన్నిక‌ల‌కు ముందురోజు ఓటుకు వెయ్యి రూపాయ‌లు, అలాగే అడిగిన వాళ్ల‌కు మ‌ద్యాన్ని అధికార పార్టీ పంపిణీ చేస్తున్న‌ట్టు రాశారు. మ‌రి ఏది నిజం? ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను ఊస‌ర‌వెల్లి రంగుల‌ను మార్చిన‌ట్టు ఆంధ్ర‌జ్యోతి రాత‌ల‌ను మార్చుతోందా? ఇదేనా మీ ఫిలాస‌ఫీ? అని ప్ర‌శ్నించే వాళ్ల‌కు ఆర్కే ఏం స‌మాధానం చెబుతారు.

తాజా ఆర్కే వ్యాసంలో విచిత్రం ఏమంటే, ఇత‌ర చాన‌ళ్ల‌ను నిందించ‌డం. క‌నీసం న‌వ్వుకుంటార‌నే స్పృహ కూడా లేకుండా నీతులు చెప్ప‌డం ఆర్కేకి మాత్ర‌మే చెల్లింది. ఆయ‌న ఏమంటారంటే…

“విచిత్రం ఏమిటంటే జగన్‌రెడ్డి అధికారానికి లొంగిపోయిన కొన్ని న్యూస్‌ చానెళ్లు కూడా పోలింగ్‌ రోజున తిరుపతిలో బాహాటంగా జరిగిన రిగ్గింగ్‌ను చూపించే సాహసం చేయలేక కళ్లు మూసుకున్నాయి”

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ అరాచ‌కాల‌ను త‌మ‌రి మీడియా ఎంత మాత్రం చూపిందో అంద‌రికీ తెలుసు. అధికారంలో ఉన్న పార్టీని అనుస‌రించి విధానాలు మార్చుకోవ‌డం త‌మ‌రితోనే స్టార్ట్ అయ్యింద‌నే విష‌యాన్ని గ్ర‌హించి వుంటే ఇలాంటి వాక్యాలు  జాలువారేవి కావు. ఎల్లో మీడియా నంది అంటే నంది, పంది అంటే పంది అన్న చాన‌ళ్లు గొప్ప‌వి. లేదంటే చెత్త అన‌డం ఆర్కే క‌లానికే చెల్లుబాటైంది.

మొత్తానికి 2024లో ఏపీలో మూడు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగి, జ‌గ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆర్కే జ్యోతిష్యం చెప్పారు. ఇలాంటి మాట‌లు, రాత‌ల వల్ల అంతిమంగా చంద్ర‌బాబుకే న‌ష్ట‌మ‌ని ఆర్కే ఎందుకు గ్ర‌హించ‌లేక పోయారో? ఆవేశం విచ‌క్ష‌ణ కోల్పోయేలా చేస్తుందనేందుకు తాజా కొత్త ప‌లుకే నిద‌ర్శ‌నమ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సొదుం ర‌మ‌ణ‌