జ‌గ‌న్ కోసం చంద్ర‌బాబు నిరీక్ష‌ణ‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కోసం టీడీపీ అధినేత , మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించాల్సి వ‌చ్చింది. చంద్ర‌బాబు ప‌డిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇంత‌కూ నిరీక్ష‌ణ ఎక్క‌డ‌? ఎందుకు? అనే…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కోసం టీడీపీ అధినేత , మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించాల్సి వ‌చ్చింది. చంద్ర‌బాబు ప‌డిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇంత‌కూ నిరీక్ష‌ణ ఎక్క‌డ‌? ఎందుకు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకుందాం.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఎన్వీ ర‌మ‌ణ నిన్న ఉద‌యం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. స‌ర్వోన్న‌త న్యాయ స్థానం అత్యున్న‌త ప‌ద‌వి ద‌క్కించుకున్న రెండో తెలుగు వ్య‌క్తిగా ఎన్వీ ర‌మ‌ణ ఘ‌న‌త సాధించారు. కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన ఎన్వీ ర‌మ‌ణ తెలుగు వారికి సుప‌రిచితులు. న్యాయ‌వాదిగా 18 ఏళ్లు, హైకోర్టు న్యాయ‌మూర్తిగా 13 ఏళ్లు, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా 7 ఏళ్ల అనుభ‌వం గ‌డించారు.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఎన్వీ ర‌మ‌ణ‌కు గ‌త కొంత కాలంగా దేశ వ్యాప్తంగా అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్వీ ర‌మ‌ణ బాధ్య‌త‌లు తీసుకున్న ఆ క్ష‌ణంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మాత్రం సొంత రాష్ట్రానికి చెందిన న్యాయ‌మూర్తి అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించినా శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డంపై అంద‌రి దృష్టి ప‌డింది.

చివ‌రికి సాయంత్రం 4.35 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ట్విట‌ర్ వేదిక‌గా …భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు శుభాకాంక్ష‌లు అని ఏక వాక్యంలో ఇంగ్లీష్‌లో విషెస్ చెప్పారు. 

ఆ త‌ర్వాత రాత్రి 7.57 గంట‌ల‌కు ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు …. భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు శుభాభినంద‌న‌లు అని తెలుగులో చెప్పడం విశేషం.

ఎవ‌రికైనా శుభాకాంక్ష‌లు చెప్పేందుకు జెట్ వేగంతో స్పందించే చంద్ర‌బాబు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి విష‌యంలో మాత్రం ముందూవెనుకా ఆలోచించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 

ఎన్వీ ర‌మ‌ణ‌కు జ‌గ‌న్ విషెస్ చెప్పేంత వ‌ర‌కూ గంట‌ల త‌ర‌బ‌డి చంద్ర‌బాబు నిరీక్షించాల్సి వ‌చ్చింద‌న్న అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణాలు ఎవ‌రికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. మొత్తానికి చంద్ర‌బాబును నిరీక్షించాలే జ‌గ‌న్ చేశార‌నే స‌ర‌దా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

సొదుం ర‌మ‌ణ‌