ఏపీలో ఎదురుచూపుల్లో మ‌రో ఉప ఎన్నిక‌

అటు తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక పోలింగ్ ముగియ‌గా, ఇప్పుడ‌ప్పుడే కాక‌పోయినా, త్వ‌ర‌లోనే మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. అదే బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌.  Advertisement…

అటు తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక పోలింగ్ ముగియ‌గా, ఇప్పుడ‌ప్పుడే కాక‌పోయినా, త్వ‌ర‌లోనే మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. అదే బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లాలోని బ‌ద్వేల్ కు సంబంధించి, ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య మృతి నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. ఆరు నెల‌ల్లోగా ఈ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. 

ఎస్సీ రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన బ‌ద్వేల్ లో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతోనే విజ‌యం సాధించింది. పోల్ అయిన ఓట్ల‌లో 60 శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప‌డ్డాయి. మెజారిటీ సుమారు 45 వేల వ‌ర‌కూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి బ‌ద్వేల్.

2004 వ‌ర‌కూ ఈ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఉండేది. ఆ స‌మ‌యంలో టీడీపీ కొద్దో గొప్పో పోటీ ఇచ్చింది. కాంగ్రెస్, టీడీపీల త‌ర‌ఫున రెడ్లే పోటీ చేసి పోరాడారు. అప్పుడు పోటాపోటీగా ఉండింది ప‌రిస్థితి. 2009లో ఈ నియోజ‌క‌వ‌ర్గం రిజ‌ర్వ‌డ్ గా మారింది. 2009లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున క‌మ‌లమ్మ భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. 

2014లో కాంగ్రెస్ అడ్ర‌స్ కోల్పోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరువీధి జ‌య‌రాములు స్వ‌ల్ప మెజారిటీతో నెగ్గారు. 2019లో మాత్రం భారీ మెజారిటీతో నెగ్గారు వెంక‌ట సుబ్బ‌య్య‌. ఆయ‌న మ‌ర‌ణంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

ఏపీలో ఇప్పుడు రాజ‌కీయ పార్టీలు మాన‌వ‌తా దృక్ఫ‌థంలో ఇలాంటి ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవంగా ముగించే ప‌రిస్థితుల్లో లేవు. ఏక‌గ్రీవంగా ముగిస్తే అటు ఖ‌ర్చు మిగులు కూడా ఉంటుంది. అయితే బ‌ద్వేల్ ఉప ఎన్నిక కూడా ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశాలు లేన‌ట్టేనేమో. మ‌రి అస‌లే త‌మ‌కు అనువుగాని స్థ‌లం, అలాంటి చోట ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిపక్ష పార్టీ టీడీపీ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తి దాయ‌క‌మైన అంశం.

గ‌త ఎన్నిక‌ల్లో 45 వేల ఓట్ల తేడాతో టీడీపీ బ‌ద్వేల్ లో ఓట‌మి పాల‌య్యింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బై పోల్ లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌డానికి కూడా సాహ‌స‌వంతులు ఎవ‌ర‌నేది అంత తేలిక‌గా తేలే అంశం కాక‌పోవ‌చ్చు. ఇక త‌మ మితృత్వంలో రాజ‌కీయ శ‌క్తిగా ఏర్ప‌డిన‌ట్టుగా చెప్పుకుంటున్న బీజేపీ-జ‌న‌సేన‌లు కూడా త‌మ స‌త్తా ఏమిటో చూపించాల్సి ఉంటుంది. 

ప‌ల్లె ప్రాంతం ఎక్కువ‌గా ఉండే నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ఓటు బ్యాంకు ఏ మేర‌కు బ‌ల‌ప‌డిందో ఈ పార్టీలు చూపించాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా త‌మ ఓటు బ్యాంకును కోల్పోలేద‌ని ఇలాంటి ఉప ఎన్నిక‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు చాటుకోవాల్సి వ‌స్తోంది!