టీడీపీ ప‌లాయ‌నవాదం.. ప‌త‌నావ‌స్థ‌కు దారి తీయ‌దా!

తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఒక ఫ‌లితాల కోసం వేచి చూపులున్నాయి. అయితే ఇప్ప‌టికే త‌మ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను చెప్పేశాయి టీడీపీ, బీజేపీలు. తిరుప‌తి లోక్ స‌భ…

తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఒక ఫ‌లితాల కోసం వేచి చూపులున్నాయి. అయితే ఇప్ప‌టికే త‌మ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను చెప్పేశాయి టీడీపీ, బీజేపీలు. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌పై చాలా క‌స‌ర‌త్తును చేసి రంగంలోకి దిగిన ఈ పార్టీలు పోలింగ్ రోజు ఉద‌య‌మే చేతులెత్తేశాయి. దొంగ ఓట్లు ప‌డుతున్నాయంటూ గ‌గ్గోలు పెట్టాయి. మ‌రోవైపు ఈ అంశంపై బీజేపీ కోర్టుకు ఎక్కింది. బీజేపీకి ఏదైనా స‌మ‌స్య ఉంటే ముందు సీఈసీకి కంప్లైంట్ ఇవ్వాలి. సీఈసీ స్పందించే తీరును బ‌ట్టి ఆ పై కోర్టుకు వెళ్ల‌వ‌చ్చు. అయితే బీజేపీ ఫిర్యాదును సీఈసీ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశాలు లేవేమో. అందుకే క‌మ‌లం పార్టీ నేత‌లు డైరెక్టుగా ఏపీ హై కోర్టును ఆశ్ర‌యించారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ క‌మ‌లం పార్టీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ హై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

విశేషం ఏమిటంటే.. బీజేపీ ఈ నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పటి నుంచి ర‌ద్దు చేయాలి, డిస్మిస్ చేయాల‌నే డిమాండ్ నే వినిపిస్తోంది. మొద‌ట్లోనేమో తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నోటిఫికేష‌న్ ను ర‌ద్దు చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్ర‌స్తుత నోటిఫికేష‌న్ ను ర‌ద్దు చేయాల‌ని, మ‌ళ్లీ నోటిఫికేష‌న్ ను జారీ చేయాలంటూ బీజేపీ వాళ్లు హ‌డావుడి చేశారు. మ‌ళ్లీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తే, దాన్ని కూడా వీళ్లు ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ను చేయ‌గ‌ల‌రు. అందుకు నిద‌ర్శ‌న‌మే పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్!

నోటిఫికేష‌న్ వ‌స్తే.. దాన్ని ర‌ద్దు చేయ‌మ‌ని గొడ‌వ‌, పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఎన్నిక ప్ర‌క్రియ‌నే ర‌ద్దు చేయ‌మ‌ని గొడ‌వ‌. ఇదీ క‌మ‌లం పార్టీ పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఉప ఎన్నిక విష‌యంలో ప‌లాయ‌న వాదాన్నే న‌మ్ముకుంది. ఈ ఉప ఎన్నిక‌లో రెండు ల‌క్ష‌ల దొంగ ఓట్లు పోల్ అయిన‌ట్టుగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు లెక్క‌గ‌ట్టేశారు. అంటే చంద్ర‌బాబు లెక్క‌ల ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం ఆ మాత్రం మెజారిటీ సాధిస్తుంది కాబోలు. తెలుగుదేశం పార్టీ లెక్క‌ల ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ల‌క్ష‌ల వ‌ర‌కూ మెజారిటీ వ‌స్తుంద‌ని తేలిందో ఏమో కానీ, రెండుల‌క్ష‌ల దొంగ ఓట్లు అని చంద్ర‌బాబు నాయుడు తేల్చేశారు!

మ‌రి రెండు ల‌క్ష‌ల దొంగ ఓట్లు పోల్ అవుతూ ఉంటే పోలింగ్ బూత్ ల‌లో టీడీపీ ఏజెంట్టు ఏం చేశారో చంద్ర‌బాబుకే తెలియాలి! క‌నీసం పోలింగ్ బూత్ ల‌లో ఏజెంట్ల‌ను పెట్టుకోలేనంత దీన‌స్థితిలో ఉందా టీడీపీ? ఏజెంట్లుగా కూర్చునే వారెవ‌రూ కూడా ప్ర‌త్య‌ర్థుల‌కు అలాంటి అవ‌కాశాన్ని ఇవ్వ‌రు. అందునా తిరుప‌తి సిటీ మిన‌హాయిస్తే… ఈ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో రూర‌ల్ ఓటింగ్ శాత‌మే ఎక్కువ‌. ఇలాంటి నేప‌థ్యంలో.. చంద్ర‌బాబు నాయుడు చెప్పిన సీన్ జ‌రిగే అవ‌కాశ‌మే లేదో.

కేవ‌లం ప‌లాయ‌న వాదాన్ని వినిపించ‌డంలో భాగంగానే చంద్ర‌బాబు నాయుడు దొంగ ఓట్లు అంటూ వాదిస్తున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఓట‌మికి ఏం సంజాయిషీ ఇచ్చుకోలేక చంద్ర‌బాబు నాయుడు దొంగ ఓట్లు అంటూ హైలెట్ చేస్తే ఉన్నారు. చంద్ర‌బాబు తానా అంటే ఆయ‌న అనుకూల మీడియా తందానా అంటుంది. ఈ నేప‌థ్యంలో తిరుపతి ఉప ఎన్నిక‌లో టీడీపీ ప‌తనా వ‌స్థ‌ను హైలెట్ కానీయ‌కుండా ఇలా ప‌లాయ‌న‌వాదాన్ని హైలెట్ చేసుకుంటూ ఉన్నట్టున్నారు.

ఇందు మూలంగా టీడీపీ త‌న‌కు తాను మోసం చేసుకోవ‌డ‌మే త‌ప్ప‌.. ఎవ్వ‌రినీ మోసం చేయ‌లేద‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు టీడీపీ పూర్తిగా దూరం అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఏవైనా ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా ఆ పార్టీ పోరాడే ప‌రిస్థితుల్లో లేదు. చంద్ర‌బాబు నాయుడు ఏం మాట్లాడ‌తారో ఆయ‌న‌కే తెలియ‌డం లేదు, లోకేష్ ఎందుకు మాట్లాడ‌తారో ఆయ‌న‌కు తెలియ‌ని ప‌రిస్థితి. చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని ఏపీ ప్ర‌జ‌లు పూర్తిగా తిర‌స్క‌రిస్తూ ఉన్నారు. ఈ ప‌రిస్థితుల్లో, ఈ ప‌త‌నావ‌స్థ‌లో ప‌లాయ‌న వాదంతో నెట్టుకురావాల‌ని టీడీపీ అధినేత భావిస్తున్న‌ట్టున్నారు.