ఆర్కే నోట ‘కొత్త’ పలుకు

''….. తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటే కేసీఆర్‌ పనితీరు బావుందని ఆంధ్రా ప్రజలు కూడా భావించేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అవుతోంది. కేసీఆర్‌ కంటే జగన్‌ పనితీరు బావుందని…

''….. తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటే కేసీఆర్‌ పనితీరు బావుందని ఆంధ్రా ప్రజలు కూడా భావించేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అవుతోంది. కేసీఆర్‌ కంటే జగన్‌ పనితీరు బావుందని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు….''

''…ప్రజలను మాయ చేయడంలో మాత్రం కేసీఆర్‌కంటే జగన్‌ ఒక ఆకు ఎక్కువే చదివారనిపిస్తోంది. జగన్‌రెడ్డి ప్రకటిస్తున్న పథకాలన్నీ మాయామశ్చీంద్రను తలపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాపించిన తొలి దశలో భారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా జగన్‌ మంచి మార్కులు కొట్టేశారు”.

ప్రతివారం తన కొత్తపలుకు శీర్షికలో జగన్ తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకుని, ఒప్పుల వైపు పొరపాటున కూడా చూడకుండా ముందుకు సాగుతున్న కాలమిస్ట్ ఆర్కే గారి ఈవారం విశ్లేషణలో పాయింట్లు ఇవి.  తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నా కూడా ఒక్కోసారి అనుకోకుండా నిజాలు బయటకు వచ్చేస్తుంటాయి. ఈవారం కూడా జగన్ తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను ఆకట్టుకుంటున్న ఆయన పథకాలు అన్నీ మాయా మశ్ఛీంద్ర పథకాలు అంటూ మాయ చేయబోయారు. న్యాయమూర్తులను కీర్తిస్తూనే, ప్రతిపక్ష నేతలు చేష్టలుడిగిన రెండు రాష్ట్రాలకు ఇక న్యాయమూర్తులే దిక్కు అన్న క్లారిటీ ఇచ్చేసారు. 

ఆ విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు పూర్తిగా డీలా పడిపోయారని, ఏమీ చేయలేకపోతున్నారని చెప్పకనే చెప్పారు. జగన్, కేసిఆర్ చర్యల కారణంగా ప్రతిపక్షనేతలు డీలా పడిపోయారన్నది రాధాకృష్ణ భావన? జగన్, కేసిఆర్ ల చర్యలు ఏమిటి? ఆ చర్యలను ప్రతిపక్ష నేతలు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? అక్కడే వుంది రాధాకృష్ణ స్కిప్ చేసిన అసలు సిసలు సంగతి. బస్ ల విషయంలో భయంకరమైన అవినీతికి పాల్పడిన జేసి బ్రదర్స్ వ్యవహారం జగన్ వదిలేసి వుంటే, ప్రతిపక్ష నాయకులుగా రంకెలు వేసేవారేమో? ఇఎస్ఐ కుంభకోణం విషయం పట్టించుకోకుండా వదిలేసి వుంటే అచ్చెంనాయుడు రెచ్చిపోయి వుండేవారేమో? అవినీతి పునాదులు కదిలిస్తుంటే,  ప్రతిపక్షనాయకులు చేష్టలుడిగి, కోర్టుల ద్వారా ప్రభుత్వానికి అడ్డం పడాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆర్కే పల్లెలకు వెళ్లాలి

ఆర్కేకు తెలియని సంగతి, తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, ఆయన ఓసారి పల్లెల్లోకి వెళ్లాలి. ఈ మధ్య నేను ఓ పల్లెకు వెళ్లాను. అక్కడి జనాలతో ముచ్చటిస్తే వారు ఇలా అన్నారు.

''జగన్ తప్పేంచేసాడు. అందరికీ డబ్బులిస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఇస్తామంటే చంద్రబాబు కోర్టుకు పోయి, అడ్డం పడిపోయాడు. లేకపోతే ఈపాటి మాకు ఇళ్ల స్థలాలు వచ్చి వుండేవి..''

ఈమాటలు నిజాలు. ఆర్కే తన కాలమ్ లో రాసినట్లు ట..ట..ట..కబుర్లు కాదు. కావాలంటే నిరూపించడానికి సిద్దం.  కోర్టులకు పోవడానికి సహేతుక కారణాలు వున్నాయా? లేవా? కోర్టులు ఏమంటున్నాయి అన్న సంగతులు పక్కన పెడితే, గ్రామాల్లో ప్రజలకు ఓ క్లారిటీ వచ్చిందన్నది వాస్తవం. చంద్రబాబు కోర్టుల ద్వారా జగన్ కు అడ్డం పడుతున్నారు. తమకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వనివ్వడం లేదు అన్న క్లారిటీ ప్రజలకు వచ్చింది. ఇది చంద్రబాబు రాజకీయ భవిష్యత్ కు చాలా అంటే చాలా ఇబ్బందికరం.

చంద్రబాబు కన్నా ఇద్దరూ బెటర్

సరే ఈ సంగతి అలా వుంచి ఆర్కే ప్రవచించిన గొప్ప విషయానికి వద్దాం. చంద్రబాబు కన్నా కేసిఆర్ బెటర్ అని జనం అనుకున్నారట. ఇప్పుడు అదే కేసిఆర్ కన్నా జగన్ బెటర్ అని అనుకుంటున్నారట. కానీ మళ్లీ వీళ్లిద్దరి కన్నా చంద్రబాబు బెటర్ అని ఎప్పుడు అనిపించుకుంటారు? అదీ అసలు సిసలు క్వశ్చను. చంద్రబాబే బెటర్ అని జనం అనుకోవాలి అని ఆర్కే కు వుంటే వుండొచ్చు. కానీ ఆ పరిస్థితి రావడం లేదు. తేవాలని ఆర్కే అండ్ కో ప్రయత్నం. 

సరే ఇంతకీ ఏ విషయంలో చంధ్రబాబు కన్నా కేసిఆర్ బెటర్ అని అనిపించుకున్నారు. సైబరాబాద్ కట్టింది తానే. అసలు తాను లేకుండా అవిభక్త ఆంధ్ర రాష్ట్ర అభివృద్దే లేదు అని చంద్రబాబు చెప్పుకున్నారు. ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అంతలా చెప్పుకున్నా, చెప్పుకుంటున్నా కూడా చంద్రబాబు కన్నా కేసిఆర్ బెటర్ అని జనం ఎలా అనుకున్నారు? ఇది అసలు పాయింట్. అలాగే కేసిఆర్ నే చంద్రబాబు కన్నా బెటర్ అనిపించుకుంటే, జగన్ అంతకన్నా బెటర్ అని ఎలా అనిపించుకున్నారు? అలా అనిపించుకోవాలంటే ఏం చేసి వుంటారు? పైగా ఇలాంటి గొప్ప విషయం ఆర్కే వరకు చేరిందంటే అది ఇంకా ఎంత గొప్ప అయి వుండాలి?

మొత్తం మీద ఆర్కే ఈవారం ఓ కొత్త విషయం వెళ్లగక్కారు. జగన్ మీద తన స్థిరాభిప్రాయం వెల్లడించారు. దాంతో పాటే కొన్ని నిజాలు వెల్లడించారు. అంగీకరించారు. ఇదే 'కొత్త' పలుకు ఈవారానికి

-ఆర్వీ