ప్రపంచానికి ఇలాంటి మహమ్మారి ఒకటి తగులుకుంటుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. భూమిపై స్వేచ్ఛా విహారిలా జీవిస్తున్న మానవుడిని నాలుగు గోడలకు పరిమితం చేసే వైరస్ ఒకటి స్వైర్యవిహారం చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కరోనా వైరస్ చైనాలో విశృంఖలం సృష్టిస్తున్న సమయంలో కూడా మిగతా ప్రపంచం భయపడలేదు. అది చైనాకే పరిమితం అయ్యే వైరస్ అని చాలా మంది భావించారు. అయితే యావత్ ప్రపంచాన్నీ అది వణికిస్తుందని, ఇలా లక్షల మంది ప్రాణాలను తీస్తుందని అనుకోలేదు. అలాంటి ఊహించనలవి కాని విపత్తును ఎదుర్కొంటూ ఉంది ప్రపంచం.
కొన్ని వందల కోట్ల మంది ఇళ్లకు పరిమితం అయ్యారు. ఎన్నో కోట్ల మందికి ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. ఎంతో మంది కరోనా సోకడంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ప్రాణాలను కూడా తీస్తూ ఉంది కరోనా వైరస్. ఇలా అన్ని రకాలుగానూ సమస్త మానవాళినినీ కరోనా వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితి లో మార్పు ఎప్పుడు? అనేది ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయి సమాధానం లేదు. కొన్ని దేశాలు కరోనా వైరస్ పై విజయం సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ప్రత్యేకించి కోవిడ్-19తో తీవ్ర ఇబ్బందులు పడిన యూరప్ దేశాలు ఆ తర్వాత తమ తీరును మార్చుకున్నాయి. పౌరులు కూడా సహకరించడంతో ప్రభుత్వాలకు పని తేలికైంది. భౌతిక దూరాలను పాటించి, లాక్ డౌన్ ల ద్వారా యూరప్ దేశాలు కరోనా ను నియంత్రించాయని అనుకోవాలి. ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశంలో ఇంకా కరోనా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉంది. లాక్ డౌన్ లు, భౌతిక దూరాల ద్వారా ఇండియాలో కరోనా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే భారత దేశంలో ప్రజల్లో ఇంకా ఆ మేరకు అవగాహన పెరగలేదు. పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో చాలా నగరాలు, పట్టణాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతూ ఉన్నాయి. మరి వీటితో అయినా పరిస్థితి మెరుగుపడుతుందేమో!
ఇక మరోవైపు కోవిడ్ -19కి విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయనే వార్తలు ఊరటగా మారాయి. బ్రిటన్ లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూపొందుతున్న వ్యాక్సిన్ బాగా ప్రభావవంతమైనదని హ్యూమన్ ట్రయల్స్ ద్వారా తెలుస్తోందట. ఆ వ్యాక్సిన్ ప్రభావాలను వివరించే ప్రకటనల్లో.. కోవిడ్ -19 పై విజయం సాధ్యమవుతుందని పరిశోధకులు విశ్వాసంగా చెబుతున్నారు. మరింత లోతైన అధ్యయనం సాగుతోందని, సెప్టెంబర్- అక్టోబర్ నాటికి ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వారు ప్రకటించారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా పరిశోధన సంస్థలు- ఫార్మా కంపెనీలు.. మనిషిలో కోవిడ్ -19ని ఎదుర్కొనే ఇమ్యూనిటీని పెంచే వ్యాక్సిన్ ల తయారీలో నిమగ్నం అయ్యాయి. కొన్ని సంస్థలు ఆగస్టులోనే వ్యాక్సిన్ వస్తుందని విశ్వాసంగా చెబుతున్నాయి. కూలంకషమైన పరిశోధనలు చేస్తున్న మరి కొన్ని సంస్థలు అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అప్పటికైనా కోవిడ్ -19 కరోనా వైరస్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలిగే వ్యాక్సిన్ వచ్చినా మానవళికి పెద్ద గండం గడిచినట్టే.