తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉన్నారు. గత పాలనలో తనకు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నట్టున్నాయి. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా చంద్రబాబుపై రోజా చెలరేగిపోతుంటారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రెండోరోజు ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లుపై చర్చను టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుకుంటుండంతో రోజా అసహనానికి గురయ్యారు. దీంతో ఆమె మైక్ అందుకున్నారు. ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లుకు టీడీపీ అడ్డుపడడం దారుణమన్నారు.
అసలు టీడీపీ సభ్యులకు జ్ఞానం ఉందా అని రోజా ప్రశ్నించారు. నిన్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన చర్చలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీమ గురించి మాట్లాడలేదన్నారు. సీమ ప్రాంతానికి ఏం కావాలో తన అనుభవాన్ని ఉపయోగించి సీఎం సూచిస్తారని అనుకున్నానన్నారు.
కానీ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొగిడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మరి మోడీ మట్టి, నీళ్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన చోట శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ఆమె ప్రశ్నించారు. అలాగే చంద్రబాబును డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ విమర్శించిన సంగతి మరచిపోయారా అని రోజా నిలదీశారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ దేశ చరిత్రలోనే లేడని కేసీఆర్ అన్న సంగతిని గుర్తు చేశారు.