‘జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. రాజధాని రైతులు పవన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆవేశ పూరిత ప్రసంగం చేశాడు. జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగాడు. శాపనార్థాలు పెట్టాడు. శపథం చేశాడు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొత్తశక్తిని కూడదీసుకున్నట్టుగా జగన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతులు, మహిళలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం కంటతడి పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆడపడచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని మండిపడ్డాడు.
ఆడపడచులపై పోలీసుల దాడిని మర్చిపోనని పవన్ అన్నాడు. అంతేకాకుండా లాఠీ దెబ్బకు అమ్మా అని కూడా అరవలేని, దివ్యాంగులనే జాలి లేకుండా పోలీసులు దాడి చేశారన్నాడు. వైసీపీకి ఒళ్లంతా మదమెక్కి ఇలాంటి పనులు చేయిస్తోందని పవన్ మండిపడ్డాడు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రౌడీయిజాన్ని చెలాయిస్తున్నారని విమర్శించాడు.
వైసీపీ వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి అని పవన్ తిట్టిపోశాడు. ఇవన్నీ వారు ప్రజలపై చూపుతారని మొదటి నుంచి తాను హెచ్చరిస్తున్న విషయాన్ని పవన్ గుర్తు చేశాడు.