తెలుగు రాష్ట్రాల్లో చర్చంతా రోజా మంత్రి పదవి గురించే…!

ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో సైతం ఒకే ఒక్క సినిమా సెలబ్రిటీ కమ్ పొలిటీషియన్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ? ఆ చర్చ ఏమిటి ? ఆ…

ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో సైతం ఒకే ఒక్క సినిమా సెలబ్రిటీ కమ్ పొలిటీషియన్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ? ఆ చర్చ ఏమిటి ? ఆ వ్యక్తి ఎవరో, ఆమె గురించి జనం, రాజకీయ వర్గాలు ఏం చర్చించుకుంటున్నాయో తెలిసిందే. ఆ వ్యక్తి  మాజీ హీరోయిన్, ప్రస్తుత టీవీ సెలబ్రిటీ కమ్ రాజకీయ నాయకురాలు. వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా. ఆమె ఆంధ్రా రాజకీయ నాయకురాలైనా తెలంగాణలో ఆమె గురించి ఎందుకు చర్చించుకుంటున్నారంటే తెలంగాణలోనూ రోజా అంటే తెలియనివారు ఎవరూ లేరు.

ఆమె సినిమా రంగానికి దూరమైనా టీవీ షోలలో ఇప్పటికీ బిజీగా ఉంది కాబట్టి ఆమె అంటే తెలియనివారు లేరు. ఆమె పేరుకు ఆంధ్రా ఎమ్మెల్యే అయినప్పటికీ ఉండేది హైదరాబాదులోనే కాబట్టి ఆమె అంటే తెలియని వారుండరు. రాజకీయాలకంటే ముందు ఆమె సినిమా హీరోయిన్ కాబట్టి అప్పటి నుంచి హైదారాబాదులోనే ఉంది. 

టీడీపీలో ఉన్నప్పుడు ఎంత గొంతు చించుకొని కాంగ్రెస్ ను, వైఎస్సార్ ను తిట్టినా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమెకు రాజకీయంగా ప్రయోజనం దక్కలేదు. వైసీపీలో చేరగానే రెండుసార్లు ఎమ్మెల్యే అయింది. మంత్రి అవుతుందనుకుంటే అది కొద్దిలో తప్పిపోయి ఏపీఐఐసీకి ఛైర్ పర్సన్ అయింది. 

ఈమధ్య నామినేటెడ్ పోస్టుల ప్రక్షాళనలో భాగంగా రోజా పదవి పోయింది. ఒకటి ప్రతికూలంగా జరిగితే మరొకటి అనుకూలంగా జరుగుతుందని రోజా నమ్ముతోంది. ఆమె అభిమానులూ నమ్ముతున్నారు. కొద్దీ నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి తనకు మంత్రి పదవి వస్తుందని రోజా అంచనా వేస్తోంది. ఆమె అభిమానులూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న చర్చంతా రోజాకు మంత్రి పదవి వస్తుందా ? రాదా ? అనేదే. 

మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు కొందరు. పోయినసారి మాదిరిగా సామాజిక సమీకరణాల లెక్క కుదరకపొతే రాకపోవచ్చని కొందరు అంటున్నారు. మంత్రి పదవి గురించి రోజాకు ఆందోళన ఉందేమో. కానీ బయటకు కనబడనివ్వదు కదా. ఆమె ఆందోళన పడుతూ ఉంటే టీవీ షోలు ఎలా ? అందులోనూ ఆమె చేసే షో అదే పనిగా ఆమె నవ్వే షో కదా. 

జగన్ కి బద్ధ శత్రువుగా ఉన్న ఒక మీడియా యాజమాన్యం ఆద్వరంలో నడిచే టీవీ షోకి జడ్జి గా ఉంది కదా. దానికి ఆమె లాజిక్ ఏంటి అంటే తాను ఎమ్మెల్యే కాక ముందు నుంచి జడ్జిగా ఉన్నాను అని. రోజా. విపక్షంలో ఉన్నపుడు కూడా జబర్దస్త్ వదులుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఆమె ఏపీఐఐసీ బాధ్యతలు తేరుకున్నాక కూడా ఆర్కే రోజా. ఆ షోని అసలు వదలడంలేదు. ఇదిలా ఉంటే తనకు మంత్రి పదవి ఖాయమని ఆర్కే రోజా అనుకుంటోంది . కానీ ఆమెను పక్కన పెట్టి జగన్ రెండేళ్ల క్రితం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అప్పట్లో రోజా హోమ్ మంత్రి అవుతుందని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. కానీ పదవి రాకపోవడంతో రోజా అలిగింది. దాని ఫలితంగా ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవిని అప్పగించారు. క్యాబినేట్ ర్యాంక్ పదవి ఇచ్చినా కూడా రోజా ఆ పదవికి  న్యాయం చేయలేదు. దానికి ఆమెలో నెలకొన్న అసంతృప్తి ప్రధాన కారణమని అంటారు. ఆమెకు తన పదవి కంటే జబర్దస్త్ ఎక్కువైంది. 

ఈ సంగతి  జగన్ కు తెలుసు. మరి ఆమెను మందలించాడో లేదో తెలియదు. కానీ రోజా మీద అసంతృప్తిగా ఉండేవాడని కొందరు చెబుతుంటారు. ఈ క్రమంలో ఉన్న ఆ పదవిని కూడా జగన్ లాగేసుకుని రాయలసీమకు చెందిన మెట్టు గోవిందరెడ్డికి కట్టబెట్టేశారు. ఆర్కే రోజా.ను అలా వట్టి ఎమ్మెల్యేగానే ఉంచేశారు. ఇది నిజంగా ఆమెకు గట్టి షాక్ గానే భావిస్తున్నారు.

ఇక రోజా గురించిన మరో అభిప్రాయం ఏమిటంటే …ఈ మధ్య కాలంలో రోజా నోరు జోరు కూడా తగ్గిందని పార్టీ అధినాయకత్వం గమనిస్తోంది. ఇదివరకూ మీడియా ముందుకు వచ్చి విపక్షాన్ని గట్టిగానే ఆమె టార్గెట్ చేసేది. వైసీపీకి అండగా  శత్రువులను చీల్చిచెండాడేది. కానీ ఇపుడు మాత్రం అంతా రివర్స్ అయింది.  

రోజా పల్లెత్తు మాట అనడంలేదు. జగన్ని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాటలు అంటున్నా కూడా ఆమె కనీసం స్పందించడంలేదు. దాంతో పాటు ఆమెకు సొంత జిల్లా చిత్తూరులోని నేతలతో ఉన్న అభిప్రాయ భేదాలు, ఎవరికీ కలుపుకుని ముందుకు పోకపోవడం, హైదరాబాద్ లోనే మకాం వంటివి చూసిన మీదటనే పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు.

ఇక మరి కొద్ది నెలలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కూడా రోజా కు చోటు దక్కదు అని కొందరు చెబుతున్నారు. దానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాతో పాటు, సామాజికవర్గం కూడా కారణం అంటున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కొత్తవారిని తీసుకోవాలంటే సీనియర్లు, జగన్ కి అత్యంత సన్నిహితులు చాలా మంది ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని, భూమన, చెవిరెడ్డిని కాదని జగన్  రోజాకి చాన్స్ ఇచ్చే సీన్ లేనేలేదని అంటున్నారు. 

ఆమెను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమిస్తారు అన్నది తాజా టాక్. అది కూడా ఆమె ఒప్పుకుంటేనే, సమీకరణలు సరిపోతేనే అంటున్నారు. అంటే రోజాకు మంత్రి యోగం లేదని చెప్పడమన్న మాట. రాజకీయాల్లోఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేం. ఉన్నపదవి ఎలాగూ పోయింది. మంత్రి పదవి రాకపోతేమాత్రం రోజా నోరు తెరవకపోవచ్చు.