వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాటికి ఆమె నుంచి జవాబులు రావాల్సి అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో రాజన్య రాజ్యం స్థాపన కోసం తన తండ్రి పేరుతో ఆమె ఓ రాజకీయ పార్టీ పెట్టారు.
ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సి అవసరం లేదు. వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పచ్చి సమైక్యవాది అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వైఎస్సార్ బతికే ఉంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉండేది కాదని ఎవరైనా చెబుతారు.
ఈ నేపథ్యంలో తన తండ్రి తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేయడం సరైంది కాదని షర్మిల వాదిస్తున్నారు. పైగా తాను తెలంగాణ బిడ్డనని, ఈ గడ్డపైనే పుట్టానని, పెరిగానని, ఈ ప్రాంత వాసినే పెళ్లి చేసుకున్నానని, ఇక్కడే పిల్లల్ని కూడా కన్నట్టు ఆమె చెబుతూ వస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో స్వతంత్ర అభ్యర్థిగా ఆ రాష్ట్రంలో రెండేళ్ల పాటు పాదయాత్ర చేసేందుకు తీన్మార్ మల్లన్న సిద్ధమయ్యారు. తాను తెలంగాణ బిడ్డనే అని చెబుతున్న షర్మిలపై తీన్మార్ మల్లన్న పవర్ఫుల్ పంచ్ విసిరారు. దాన్ని పట్టుకుని నెటిజన్లు షర్మిలను సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఇంతకూ ఆ పంచ్ ఏంటో తెలుసుకుందాం.
రాజన్న బిడ్డ షర్మిల తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటున్నారని, మరి ఆమె ఓటరు కార్డు, ఆధార్ కార్డు పులివెందుల్లో ఉన్నాయి కదా? అదెట్లా సాధ్యమని తీన్మార్ మల్లన్న నిలదీయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షర్మిలను వ్యతిరేకించే తెలంగాణ వాదులకు ఆయన ఓ బలమైన ఆయుధం ఇచ్చినట్టైంది. ఔను కదా… షర్మిల తెలంగాణ బిడ్డ అయితే ఇక్కడ ఓటు వేయకుండా పులివెందుల్లో ఎందుకేస్తున్నట్టు? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కడప జిల్లా పులివెందులలో వైఎస్ కుటుంబానికి సంబంధించి ఓట్లు ఉన్నాయి. పులివెందులలోని భాకరాపురంలో వైఎస్ కుటుంబ సభ్యుల నివాస గృహాలున్నాయి. 2014, 2019, అంతకు ముందు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి జయమ్మ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న లేవనెత్తిన పాయింట్ చాలా విలువైందిగా తెలంగాణవాసులు భావిస్తున్నారు. ఇదే విషయమై ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ తెలంగాణ బిడ్డవైతే మీ ఆధార్, ఓటరు కార్డులోని చిరుమానాలేంటో బయట పెట్టాలని నిలదీస్తున్న వాళ్లకు ఆమె తప్పక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిల నుంచి సమాధానం రాకపోతే మాత్రం… పులివెందుల చిరునామాతోనే ఇప్పటికీ ఓటు, ఆధార్ కార్డు ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న సంధించిన ప్రశ్న మాత్రం షర్మిలను నైతికంగా ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.