జగన్ వందరోజుల పాలనపై విరుచుకుపడిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ శ్రేణులు ముప్పేటదాడి చేస్తున్నాయి. దాదాపు కీలక నేతలంతా ఎదురుదాడికి దిగారు. బొత్స, అంబటి, రోజా లాంటి నేతలంతా పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకెత్తయితే, ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలెట్ గా మారాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక విధానంపై పవన్ చేసిన విమర్శల్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు విజయసాయి రెడ్డి.
“ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా. ఇసుకును కిలో, పదికిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా తెలియపర్చండి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది.”
ఇలా పవన్ పేరెత్తకుండా, అతడ్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు విజయసాయి. ఇసుకను ప్యాకేజీల్లో అమ్మరంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూనే.. ప్యాకేజీ అనే పదానికి కొటేషన్లు తగిలించడంలో మొత్తం మేటర్ అందరికీ అర్థమైపోయింది. దీనికితోడు తాజాగా పవన్ నిర్మించుకున్న ఇంటిపై కూడా విజయసాయి తన ట్వీట్ లోనే సెటైర్ వేయడం హైలెట్ అయింది. ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కు ఇసుక ఫ్రీగా వచ్చి ఉంటుందని, అందుకే రవాణా ఖర్చులపై పవన్ కు అవగాహన లేనట్టుందంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంపై రోజా కూడా ఘాటుగా స్పందించారు. పెయిడ్ ఆర్టిస్టులతో పని జరక్కపోవడంతో, చంద్రబాబు ఇప్పుడు పవన్ ను రంగంలోకి దించారని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు అరాచక పాలనలో కళ్లు మూసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ అలా మాట్లాడ్డంలో తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదన్న రోజా, అంతా స్క్రిప్ట్ పరంగా నడిచిందని సెటైర్ వేశారు.