కరోనా చనిపోయిన బాధిత కుటుంబాలుకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలా ఎక్స్గ్రేషియా ఇస్తే కోవిడ్ సహాయక నిధులు సరిపోవని స్పష్టం చేసింది.
కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఉంటుందని, కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు ఇవ్వడం కుదరదని అఫిడవిట్లో కేంద్రం తేల్చి చెప్పింది.
ఇప్పటి వరకూ భారత్లో కరోనా మహమ్మారి వల్ల 4 లక్షల మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున 4 లక్షల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే ఎస్డీఆర్ఎఫ్ మొత్తం నిధులు దానికే సరిపోతాయనేది కేంద్ర ప్రభుత్వ వాదన.
ఇక మిగిలిన మిగతా వాటి కోసం మరింత భారీగా నిధులు సమకూర్చాల్సి వుంటుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది.
ఒక్కో కోవిడ్ బాధిత కుటుంబానికి రూ.4 లక్షలు ఇస్తే, వరదలు, తుపాన్లు, మందుల కొనుగోళ్లు లాంటి సహాయక చర్యలేవీ చేపట్టలేమని కేంద్రం పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 2019-20లో కోవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రాలకు అదనంగా రూ.1113.21 కోట్లు విడుదల చేసినట్లు కూడా కేంద్రం తెలిపింది.