న‌టిని మోస‌గించిన కేసులో మాజీ మంత్రి అరెస్ట్

పెళ్లి చేసుకుంటాన‌ని ఓ న‌టిని మోస‌గించిన కేసులో త‌మిళ‌నాడు మాజీ మంత్రి ఎం.మ‌ణికంద‌న్‌ను చెన్నై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. త‌న‌పై మాజీ మంత్రి అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని ఇటీవ‌ల ఓ న‌టి ఆరోప‌ణ‌లు త‌మిళ‌నాడులో…

పెళ్లి చేసుకుంటాన‌ని ఓ న‌టిని మోస‌గించిన కేసులో త‌మిళ‌నాడు మాజీ మంత్రి ఎం.మ‌ణికంద‌న్‌ను చెన్నై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. త‌న‌పై మాజీ మంత్రి అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని ఇటీవ‌ల ఓ న‌టి ఆరోప‌ణ‌లు త‌మిళ‌నాడులో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా ఘ‌ట‌న‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మణికందన్ మంత్రిగా ప‌నిచేశాడు. ఆయ‌న‌పై వర్థమాన నటి చాందిని ఇటీవ‌ల తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో …2017లో స‌ద‌రు మంత్రిని తాను కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. 

మలేసియాలో వ్యాపారం చేద్దామని తనతో ఆయన చెప్పారన్నారు.పెళ్లి చేసుకుంటానని న‌మ్మ‌బ‌ల‌క‌డంతో …తామిద్దరమూ దగ్గరయ్యామని ఆమె తెలిపారు. తనను ఆయన హింసించారని, గర్భస్రావం చేయించారని ఆమె ఆరోపించారు.

బాధిత న‌టి  ఫిర్యాదు మేరకు మణికందన్‌పై అడయార్ ఆల్ ఉమన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, గర్భస్రావం చేయించడం, మోసగించడం వంటి ఆరోపణలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు కోసం మద్రాస్ హైకోర్టును మణికందన్ ఆశ్రయించాడు. ఆయన పిటిషన్‌ను హైకోర్టు  మూడు రోజుల క్రితం తోసిపుచ్చింది. దీంతో త‌న‌ను అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతో ఆయ‌న అదృశ్య‌మ‌య్యాడు.

స‌ద‌రు మాజీ మంత్రిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొద‌లు పెట్టారు. త‌మిళ‌నాడు వ‌దిలి మ‌రెక్క‌డో త‌ల‌దాచు కున్నాడ‌ని పోలీసులు అనుమానించారు. చివరికి ఆయన బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు ఆచూకీ తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అక్కడికి వెళ్ళి ఆదివారం ఉదయం ఆయన్ను అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో వర్థమాన నటి చాందిని కేసు ఏ మ‌లుపు తిరుగుతుందోన‌నే  ఉత్కంఠ త‌మిళ‌నాడులో నెల‌కుంది.