న‌మ్మినందుకు న‌ట్టేట ముంచాడు

పెళ్లి చేసుకుంటాడ‌ని న‌మ్మినందుకు ఓ ప్ర‌బుద్ధుడు న‌ట్టేట ముంచాడు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మ‌హిళ‌కు చివ‌రికి తీవ్ర నిరాశ‌. పైగా ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. న్యాయం…

పెళ్లి చేసుకుంటాడ‌ని న‌మ్మినందుకు ఓ ప్ర‌బుద్ధుడు న‌ట్టేట ముంచాడు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మ‌హిళ‌కు చివ‌రికి తీవ్ర నిరాశ‌. పైగా ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. న్యాయం కోసం హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ ఠాణా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. హైద‌రాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని అత్యంత ధ‌నిక ప్రాంత‌మైన జూబ్లిహిల్స్‌లో నివ‌సిస్తున్న సాప్ట్‌వేర్ ఉద్యోగిని న‌మ్మి మోస‌పోయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి గ‌తంలో వివాహ‌మైంది. దంప‌తుల మ‌ధ్య విభేదాలు …చివ‌రికి విడాకుల‌కు దారి తీశాయి. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురి యోగ‌క్షేమాల‌ను చూసుకుంటూ ఉండేది. ఈ క్ర‌మంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌న్న ఆలోచ‌న మ‌న‌సులో మెదిలింది.

దీంతో త‌న‌కు ఎలాంటి భ‌ర్త కావాలో, అలాగే తన సోష‌ల్ స్టేట‌స్ త‌దిత‌ర వివ‌రాల‌ను మ్యాట్రిమోనిలో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఆమెకి మ్యాట్రిమోనిలో వివ‌రాలు ప్ర‌క‌టించిన రెండు రోజుల‌కు విజ‌యానంద్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. తాను డాక్ట‌ర్ అని, బ్రిట‌న్‌లో వుంటాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. ఇష్ట‌మైతే పెళ్లి చేసుకుంటాన‌ని స‌ద‌రు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ముందు ప్ర‌తిపాద‌న పెట్టాడు. పెళ్లి త‌ర్వాత ఇండియాలో స్థిర‌ప‌డ‌తాన‌ని న‌మ్మించాడు. నీవు లేనిది తాను లేన‌ని ప్రేమ క‌బుర్లు చెప్పి న‌మ్మించాడు.

త‌న‌పై ఆమెలో న‌మ్మ‌కాన్ని పెంచేందుకు ఇంటి సామగ్రితో పాటు అందమైన బహుమతులు, నగదు పంపిస్తున్నానని బాధితురాలికి చెప్పాడు. ఆ త‌ర్వాత రెండు రోజులకే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమెకి ఫోన్‌కాల్‌. తాను కస్టమ్స్‌ ఆఫీసర్‌ రుబీనాఖాన్‌ మాట్లాడుతున్నానని, మీకు విదేశీ కరెన్సీతో కూడిన పార్శిల్‌ వచ్చిందని చెప్పింది. 

కస్టమ్స్‌, జీఎస్టీ వంటి పన్నులతో పాటు పార్శిల్‌లో డాలర్లు ఉన్న కారణంగా ఆర్‌బీఐ నుంచి నో అబ్జెక్షన్‌, యాంటీ టెర్రరిస్ట్‌ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని సాప్ట్‌వేర్ ఉద్యోగినితో క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్ రుబీనాఖాన్ చెప్పింది.

విమానాశ్ర‌యం నుంచి వాటిని తెచ్చుకునే క్ర‌మంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విడతల వారీగా రూ.50 లక్షలు చెల్లించింది. కోరినంత డ‌బ్బు పంపినా పార్శిల్‌ మాత్రం రాలేదు. మ‌రోవైపు ఇంకా రూ.30 లక్షలు పంపాల‌ని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని బెదిరింపులకు దిగ‌డంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి అనుమానం క‌లిగింది. 

తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించింది. దీంతో ల‌బోదిబోమ‌ని న్యాయం కోసం బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా చెప్పి ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం కేసు దర్యాప్తులో ఉంది. బాగా చ‌దువుకున్న మ‌హిళ కూడా మోస‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.