ప్రజలకు గులాబీలు.. రోడ్లపై వంటావార్పు
చౌరస్తాల్లో ధర్నాలు.. ఉస్మానియాలో భారీ సభ
తెలంగాణ అంతటా పాటించిన బంద్ సక్సెస్ అవ్వడంతో ఆర్టీసీ జేఏసీలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఊహించని విధంగా ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి మద్దతు రావడంతో పాటు కొన్ని స్వచ్చంధ సంస్థలు కూడా ముందుకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పాటించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. దీంతో ఆర్టీసీ జేఏసీ ఇవాళ్టి నుంచి ప్లాన్-బిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈరోజు ప్రజలకు గులాబీలు ఇచ్చే కార్యక్రమం షూరూ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ ఆవశ్యతకను ప్రజలకు తెలుపుతారు. దీంతో పాటు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు. సమ్మె కారణంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలకు దసరా శెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో శెలవులు ముగిసి, రేపట్నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మరోసారి ఇక్కట్లకు గురవుతారు. అదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు కార్మికులు.
రేపట్నుంచి రాజకీయ పార్టీల ముఖ్యనేతల్ని కలవాలని నిర్ణయించిన జేఏసీ, అన్ని డిపోలు, బస్టాండుల్లో ధర్నాలు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం టైమ్ లో చేసినట్టుగా, సోమవారం నుంచి రోడ్లపై వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించాలని కూడా అనుకుంటోంది. అయితే ఇవన్నీ ఒకెత్తయితే.. ఉస్మానియాలో ఏర్పాటుచేయబోతున్న బహిరంగ సభ మరో ఎత్తు.
ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభలో టీఆర్ఎస్, మజ్లిస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొంటాయి. అదే కనుక జరిగితే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. రేపట్నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో, ఇన్నాళ్లూ అద్దె ప్రాతిపదికన తిరిగిన స్కూల్ బస్సులు మళ్లీ వెనక్కి వెళ్లిపోతాయి. కాంట్రాక్ట్ మీద ఇన్నాళ్లూ ఆర్టీసీ బస్సుల్ని నడిపించిన స్కూల్ బస్సు డ్రైవర్లలో చాలామంది రేపట్నుంచి విధులకు వెళ్లరు. ఈ సమస్య నుంచి ప్రభుత్వం ఎలా గట్టెక్కుతుందో చూడాలి. మరోవైపు చర్చలకు సంబంధించి మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటుచేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఈరోజు ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.