హుజూర్‌నగర్‌లో ఎవరి పరువు పోతుంది?

ఒకప్పుడు ఉప ఎన్నికలంటే రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా కూడా లైట్‌గా తీసుకునేవారు. లైట్‌గా తీసుకునేవారంటే అసలు పట్టించుకోకుండా ఉండటమనే అర్థం కాదు. కాని పరువు ప్రతిష్టల సమస్యగా తీసుకునేవారు కాదని చెప్పొచ్చు. కాని…

ఒకప్పుడు ఉప ఎన్నికలంటే రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా కూడా లైట్‌గా తీసుకునేవారు. లైట్‌గా తీసుకునేవారంటే అసలు పట్టించుకోకుండా ఉండటమనే అర్థం కాదు. కాని పరువు ప్రతిష్టల సమస్యగా తీసుకునేవారు కాదని చెప్పొచ్చు. కాని కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. 'చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి' అనే భావన పెరిగిపోయింది. మొక్కే కదా అని పీకిపారేస్తే పీక తెగుద్ది అనే టైపులో ఉప ఎన్నికే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికార, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఒక్క ఉప ఎన్నికైనా సరే అధికార పక్షం సర్వశక్తులు ఒడ్డే పరిస్థితి రాజకీయాల్లో ఏర్పడింది. తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక చూస్తే ఇది అధికార, ప్రతిపక్షాలకు పరువు ప్రతిష్టల సమస్యగా మారిందనే విషయం అర్థమైపోయింది. 

సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నిక విషయంలో అధికారపక్షం భయపడదు. ఎక్కువ శాతం ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంటాయి. ఫలితాలు అనుకూలంగా, ప్రతికూలంగా రావడం అధికార పక్షానికి ఉండే ఆదరణ మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందనుకోండి. తెలంగాణ పూర్తి ప్రశాంతంగా ఉన్నట్లయితే హుజూర్‌నగర్‌ ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పే అవకాశముండేది. కాని హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ప్రకటించిన తరువాత రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఆర్‌టీసీ సమ్మె ఉవ్వెత్తున చెలరేగడం, సమ్మెను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడం, బంద్‌ జరగడం, ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రజల్లోనూ ఆర్‌టీసీ కార్మికుల పట్ల సానుభూతి ఉండటం….ఇలా అనేక పరిణామాలు ఉప ఎన్నికకు ఎక్కడలేని ప్రాధాన్యత కల్పించాయి. అసలు ఉప ఎన్నిక ప్రకటించగానే టీఆర్‌ఎస్‌ దీన్ని మహా యుద్ధంలా చిత్రీకరించింది. ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ నాయకుల ప్రకటనలన్నీ హుజూర్‌ నగర్‌ రణరంగమేనన్న భావన కలిగించాయి.

దానికి తగ్గట్లు కాంగ్రెసు పార్టీలో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలోనే వాదవివాదాలు, లుకలుకలు బయలుదేరడంతో ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని అనుకున్నారు. కాని క్రమంగా రాష్ట్రంలో పరిస్థితి వేడెక్కింది. ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రం రణరంగమైంది. ఈ ప్రభావం హుజూర్‌నగర్‌లో తప్పనిసరిగా ఉంటుంది. ఆర్‌టీసీ కార్మికుల సమ్మెను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండివైఖరిని, మంత్రుల, అధికార పార్టీ నేతల మౌనాన్ని హుజూర్‌నగర్‌ ఓటర్లు ఇన్నాళ్లు గమనించారు కాబట్టి వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఉంది. సమ్మెకు మద్దతుగా బీజేపీ చాలా దూకుడుగా వెళ్లింది. కాంగ్రెసు కూడా దాంతో పోటీ పడింది. సీపీఐ అధికార పార్టీకి మద్దతు ఇచ్చి విమర్శలను ఎదుర్కొని, చివరకు పరిణామాలు మారిపోవడంతో రాజకీయంగా నష్టం కలుగుతుందనే భయంతో మద్దతు ఉపసంహరించుకుంది.

సరే…టీడీపీ, ఇతర పార్టీల గురించి చెప్పుకునేది ఏమీ లేదనుకోండి. వాస్తవానికి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఉత్తమ్‌ కారణంగానే ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి దాన్ని తిరిగి సాధించుకోవాలనే పట్టుదల ఆయనలో (కాంగ్రెసులో కూడా) ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు. 'తన అభ్యర్థి ఓడిపోవడమా' అనే బాధ కేసీఆర్‌కు ఉన్నట్లుంది. అందుకే ఆయన్నే నిలబెట్టారు. కాబట్టి సీఎం కూడా ఉప ఎన్నికను వ్యక్తిగతంగా తీసుకున్నారు. యుద్ధంలో సైన్యాన్ని మోహరించనట్లుగా అక్కడ నాయకులను మోహరింపచేశారు. కుమారుడు కేటీఆర్‌కు బాధ్యత అప్పగించారు. ఉప ఎన్నికకు ప్రత్యేకంగా ఇన్‌చార్జిని నియమించారు. కేసీఆర్‌కు అధికారం చేతిలో ఉండి కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కట్టాలన్నట్లుగా పకడ్బందీ వ్యూహాలు రూపొందించారు. కాని ఆర్‌టీసీ కార్మికుల సమ్మె ఆయన్ని ఉప ఎన్నికపై దృష్టి పెట్టనీయకుండా చికాకు పెట్టింది. 

సరే…ప్రచారం ముగిసే సమయానికి బహిరంగ సభ పెడదామని ప్లాన్‌ చేసుకుంటే అది వర్షార్పణం అయింది. వర్షం కాసేపు కురిసి తగ్గిపోయిందని, వెళ్లే అవకాశం ఉన్నా కేసీఆర్‌ వెళ్లలేదని, అక్కడ తనకు నిరసనలు ఎదురవుతాయని భయపడ్డారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. హుజూర్‌నగర్‌లో పోటీ చేసి ఉనికి చాటుకోవాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అసలు అటుకేసి చూడలేదు. హీరో బాలకృష్ణ, గత ఎన్నికల్లో కూకట్‌పల్లిలో పోటీ చేసి ఓడిపోయిన హరికృష్ణ కూతురు సుహాసిని ప్రచారం చేస్తారని వార్తలు వచ్చినా ఏదీ కాలేదు. రాష్ట్రం ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ఉత్తమ్‌ పరువు పోతుందా? కేసీఆర్‌ ప్రతిష్ట దెబ్బ తింటుందా? 24న తేలుతుంది. టీఆర్‌ఎస్‌ గెలిస్తే మాత్రం ఆర్‌టీసీ సమ్మె పట్ల ఆయన వైఖరి కరెక్టేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తారు.