రాజస్తానీ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. కొంతమంది ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్న సచిన్ పైలట్ ని అన్ని పదవుల నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ. అటు రాజస్తాన్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలోనూ, మరోవైపు రాజస్తాన్ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలోనూ వ్యవహరించాడు సచిన్ పైలట్. ఆ రెండు పదవుల నుంచి ఆయనను తొలగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందట. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదా నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆయను తొలగిస్తూ రాజస్తానీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ కు రెక్కలు కత్తిరించినట్టే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సచిన్ ఏం చేస్తారనేది తదుపరి ఆసక్తిదాయకమైన అంశం. ఆ ఎమ్మెల్యేలపై కూడా కాంగ్రెస్ పార్టీ వేటు వేయిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. స్పీకర్ పదవి కాంగ్రెస్ చేతిలోనే ఉంది. స్పీకర్ ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ వెంట ఉన్న ఎమ్మెల్యేల పై వేటు వేయవచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది. అదే జరిగితే.. సచిన్ వర్గానికి మరింత ఝలక్ అవుతుంది.
అదే సమయంలో ప్రభుత్వం కూడా మైనారిటీలో పడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆ పార్టీతోనే ఉంటారనేదాన్ని బట్టి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉండవచ్చు. అయితే ఉన్నఫలంగా వారందరి మీదా వేటు వేస్తారా? లేక వారిని బతిమాలి, బుజ్జగించి తమ వైపుకు తిప్పుకుంటారో కాంగ్రెస్ వాళ్లు! సచిన్ పై వేటు వేయడం ద్వారా కాంగ్రెస్ స్పష్టమైన సంకేతాలను పంపినట్టే అనుకోవాలి. తదుపరి పరిణామాలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇప్పుడు సచిన్ పెలట్ వెళ్లి బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ గవర్నమెంట్ ను పడగొట్టి తన ఇగోని చల్లార్చుకుంటాడా? లేక కొత్త పార్టీ పెట్టి.. తన ఆత్మాభిమానాన్ని నిలుపుకుంటాడో!