ఇంతకీ రాజస్తాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు లేవదీసిన సచిన్ పైలట్ ఏం సాధించినట్టు? అనేది ఇప్పుడప్పుడే తేలే అంశం కాదు. అయితే ఆయన తను కాంగ్రెస్ లోనే ఇంకా ఉన్నట్టుగా ప్రకటించుకోవడం మాత్రం ఒకింత విడ్డూరంగా ఉంది! సచిన్ పైలట్ తిరుగుబాటులో వ్యూహం లేదు అనే అభిప్రాయాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా సచిన్ వ్యూహ లేమి కాదు, అశోక్ గెహ్లాట్ వ్యూహం అనే అభిప్రాయాలు కూడా జాతీయ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి.
ఒక స్ట్రాటజీ ప్రకారం సచిన్ పైలట్ ను పార్టీకి దూరం చేశాడని అశోక్ గెహ్లాట్ పేరును ప్రస్తావిస్తున్నారు నేషనల్ మీడియా జర్నలిస్టులు. ఈ అధికార పర్వంలో సచిన్ తన పదవికి ఎసరు తెస్తాడనే లెక్కతో అతడి వేళ్లతోనే, అతడి కళ్లలో పొడిపించాడు అని, అశోక్ గెహ్లాట్ రాజకీయ వ్యూహం ఇదంతా అని నేషనల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజాగా సచిన్ పైలట్ కు స్పీకర్ నోటీసులు కూడా ఇప్పిస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పైలట్ ను డిప్యూటీ సీఎం హోదా నుంచి, రాజస్తాన్ పీసీసీ అధ్యక్ష హోదా నుంచి తప్పించారు. ఇప్పుడు ఆయనకూ, ఆయనతో పాటు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకూ స్పీకర్ నోటీసులు జారీ కానున్నాయట. పార్టీతో ఉన్నట్టా.. లేక అనర్హత వేటును ఎదుర్కొంటారా? అనేది ఆ నోటీసుల సారాంశం. ఈ ఊపులోనే వారందరి మీదా అనర్హత వేటు వేస్తే.. సచిన్ పైలట్ కు పెద్ద పరీక్ష ఎదురయినట్టే. వ్రతం చెడీ, ఫలం దక్కనట్టుగా అవుతుంది పైలట్ పరిస్థితి.
ఉన్న పదవీ పోయి, వెంట ఉన్న వారంతా అనర్హతకు గురయితే.. ఉప ఎన్నికల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. అయితే తను కాంగ్రెస్ తోనే ఉన్నట్టుగా పైలట్ ప్రకటించుకోవడంతో.. రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడా? అనే అభిప్రాయాలకూ ఆస్కారం ఏర్పడింది. సచిన్ తో రాహుల్ గాంధీ మాట్లాడతాడు అని కూడా కాంగ్రెస్ లీకులు ఇస్తోండి ఢీల్లీ నుంచి. ఇంత జేసీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో సర్దుకుపోతే సచిన్ కు అంతకన్నా అవమానం ఉండదు. బీజేపీ కూడా సచిన్ ను ఆదరించే అవకాశాలు లేవు. అతడి బలం ఎంతో తేలిపోయింది. 18 మంది ఎమ్మెల్యేలతో పని కాదు. అందునా ఉప ఎన్నికలు వచ్చినా రావొచ్చు! ఆపై బీజేపీలో వసుంధరరాజే రూపంలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ అక్కడ సీఎం క్యాండిడేట్ అయ్యే ఆస్కారం ఉండనే ఉండదు.
సచిన్ కు ప్రజా బలం ఉందా? లేదా? అనేది తర్వాతి సంగతి. ప్రస్తుతం అయితే క్రాస్ రోడ్స్ లో నిలబడ్డాడు. అశోక్ గెహ్లాట్ చాలా తెలివిగా సచిన్ ను ఇలాంటి పరిస్థితుల్లో పడేశాడనే జాతీయ మీడియాలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి సచిన్ పైలట్ ఎలా బయటపడతాడో! ఆత్మగౌరవాన్ని కాపాడుకొంటూ కొత్త పార్టీ పెట్టి సత్తా చూపడమే అతడి నాయకత్వ స్థాయికి నిదర్శనం అవుతుంది. మరి అంత సత్తా ఉందా?