ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి గొప్పతనాన్ని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నాటి టీడీపీ వేరు, ఇప్పటి టీడీపీ వేరన్నారు. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేదే ఇప్పటి టీడీపీ పాలసీ అని ఆయన అన్నారు.
టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదని.. 27 ఏళ్ల సంబరమేనంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. బాబుకు మీడియా మేనేజ్‌మెంట్ బాగా తెలుసన్నారు. ఎన్టీఆర్ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్‌తో అధికారంలోకి వచ్చారని వ్యత్యాసం చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదే అని ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉందన్నారు. అసెంబ్లీ జరగకుండా అడ్డుకునేందుకు టీడీపీ యత్నించిందని విమర్శించారు. టీడీపీకి బాకా ఊదడమే ఎల్లో మీడియా పని అని సజ్జల విమర్శించారు.
ఒక్క నయాపైసా కూడా వృథా కాకుండా నేరుగా లబ్ధిదారులకు అందించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. చంద్రబాబు వదిలేసిన అప్పులు తాము చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క అమ్మఒడి కిందే ఏటా 50వేల కోట్లు తల్లుల అకౌంట్లలో పడుతున్నాయన్నారు. మీ బతుక్కి ఒక్క పథకం ఏదైనా ఒక్కటైనా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.
తమ పథకాల వల్ల ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉన్నాయన్నారు. తమ పరిపాలనను దేశమంతా పరిశీలిస్తోందన్నారు. ఇది టీడీపీకి మింగుడు పడటం లేదన్నారు. తమను ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబు ఒక కోటరీతో కుట్ర చేశారన్నారు.
ప్రజా బలంతో ఎన్టీఆర్ ఎదిగితే.. కుట్రలతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆ రోజు చంద్రబాబు వ్యవహరించారన్నారు. చంద్రబాబు హయాంలో 27 ఏళ్ల టీడీపీ చరిత్రపై పరిశోధనలు జరగాలని పిలుపునిచ్చారు. పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన వైఎస్సార్, జగన్‌ల ముందు చంద్రబాబు ఎత్తుగడలు సాగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలపై మాట్లాడటానికి టీడీపీ ఎందుకు ఉపయోగించుకోలేదని ఆయన ప్రశ్నించారు.