మంచి మాటలతో ఉద్యోగుల్ని మచ్చిక చేసుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం తన ప్రయత్నాలను ఏ మాత్రం ఆపలేదు. ఉద్యోగులు తమకు శత్రువులు కాదనే మాటను పదేపదే వ్యూహాత్మకంగా చెప్పడం గమనార్హం. కొత్త పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ వల్ల జీతం పెరగదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇక్కడే ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. తమకు జీతాలు పెరగవని ఉద్యోగులు అపోహ పడుతున్నారనేది ప్రభుత్వ వాదన. వాటిని తొలగించేందుకు ఏపీ సర్కార్ మంత్రులు, సలహాదారు, ఉన్నతాధికారులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మూడు రోజులుగా పీఆర్సీ సాధన సమితి నాయకుల రాక కోసం ఎదురు చూస్తోంది. చివరికి ఎదురు చూపులే తప్ప, ఉద్యోగ సంఘాల నేతలు వారి వైపు తలెత్తి చూడడం లేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నేతల్ని చర్చలకు వెళ్లాలని ఉద్యోగులు కోరాలని ఆయన సలహా ఇచ్చారు. చర్చించుకుంటనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. తమతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
ఈరోజు(గురువారం) మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉద్యోగుల కోసం ఎదురు చూసినట్టు సజ్జల తెలిపారు. వ్యక్తిగతంగా కూడా రమ్మని పిలిచామన్నారు. టీవీల్లో మాట్లాడ్డం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేపటి నుంచి కూడా తాము అందుబాటులో ఉంటామన్నారు. ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తామన్నారు. ఉద్యోగులు తమకు శత్రువులు కాదని స్పష్టం చేశారు. వాళ్లంతా తమ ఉద్యోగులే అని సజ్జల తెలిపారు.