రాజకీయ భవిష్యత్తు సరే …. పార్టీయే రిజిస్టర్ కాలేదు కదా!

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి హడావుడి చేస్తున్నప్పటికీ ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి…

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి హడావుడి చేస్తున్నప్పటికీ ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని షర్మిల ఇప్పటికి అనేకసార్లు చెప్పింది. కానీ ఆమెకు అంత సీన్ లేదని తెలంగాణలో ఆమె పార్టీ పరిస్థితి, ఆమెకున్న ప్రజాదరణ చూసిన ఎవ్వరైనా చెబుతారు.

షర్మిల రాజకీయ భవిష్యత్తే కాదు, ఇప్పుడు ఆమె పరువు ప్రతిష్టలు ఏమవుతాయోననే ఆందోళన కూడా షర్మిలను నమ్ముకున్నవారికి కలుగుతోంది. ఆమె తెలంగాణా రాజకీయాలలోకి అరంగేట్రం చేసి దాదాపు ఏడాది కూవొస్తోంది. కానీ ఇప్పటివరకు ఆమె పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కాలేదు. కానీ షర్మిల మాత్రం వైఎస్సార్ టీపీ పేరుతో రాజకీయాలు చేస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆమె పార్టీ ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కాలేదు. తెలంగాణలో త‌న‌దైన ముద్ర వేస్తూ, రాజ‌న్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ ష‌ర్మిల పార్టీ  పెట్టానని  చెప్పి దాదాపు ఏడాది అవుతోంది.

2021 ఫిబ్రవ‌రి 9న హైద‌రాబాద్‌లో కార్యక‌ర్తల‌తో స‌మావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమె అప్పటికే ఎన్నిక‌ల సంఘం రిజిష్ట్రేష‌న్ కోసం దకఖాస్తు  చేశారు. జులై 9న అధికారికంగా స‌భ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామ‌క‌ర‌ణ చేసి జెండా, అజేండా ప్రక‌టించారు. కాని ఇప్పటికీ ష‌ర్మిల పార్టీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కాలేదు. ష‌ర్మిల పార్టీ పేరు రిజిస్టర్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే ఆమె పార్టీని గుర్తించ‌వద్దని, అన్న వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా ఢిల్లీ  కోర్టులో ఫీర్యాదు చేశారు.

మ‌రోవైపు ఎన్నిక‌ల సంఘానికి కుడా పార్టీకి గుర్తింపునివ్వడంపై త‌మకు అభ్యంతారాలు ఉన్నాయ‌ని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరు మీద మ‌రో పార్టీ వ‌స్తే ప్రజల్లో గంద‌ర‌గోళం నెల‌కొంటుంద‌ని అయ‌న ఈసీకి వివ‌రించారు. అన్న వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు కడపకు చెందిన వాడు. కాబట్టి ఈయన వెనుక వైఎస్ జగన్ ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. తనపై కుట్ర జరుగుతోందని షర్మిల కూడా చెప్పారు.

అన్న వైఎస్సార్ పార్టీ అభ్యంతరం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఈసీ ష‌ర్మిల పార్టీ రిజిస్ట్రేషన్  గురించి పెద్దగా ముంద‌డుగు పడలేదు. ప్రతి నెల కొన్ని ప్రశ్నల‌తో లెట‌ర్లు మాత్రం రాస్తూ పార్టీ గుర్తింపు ప్రక్రియను పుర్తి చేయ‌డం లేదు. కానీ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిందని ఇదివరకు ప్రచారం జరిగింది. దీనిపై ష‌ర్మిల కుడా తీవ్ర అస‌హనం వ్యక్తం చేస్తున్నారు. ద‌ర‌ఖ‌స్తు చేసుకొని ఏడాది అయినా ఇప్పటి వ‌ర‌కు గుర్తింపు ఇవ్వకుండా ఈసీ తాత్సారం చేయ‌డం ఏమిటో అర్ధం కావ‌డం లేద‌ని అసంతృప్తితో ఉన్నారు.

దీనిపై నేరుగా ఈసీని అడగడమే క‌రెక్ట్ అని ష‌ర్మిల భావిస్తున్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకుంట‌న్నాం కాబట్టి త‌న త‌ల్లి, వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మి నుండి ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని స‌ర్టీఫికెట్ కుడా ఇచ్చినా ఈసీకి ఇంకా ఎం అభ్యంత‌ర‌మో అర్ధం కావ‌డం లేదని వైఎస్ షర్మిల అన్నారు. పార్టీ గుర్తింపు లేకుండా ఎలా కార్యక్రమాలు చేపట్టాలా? అని కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఈసీ పార్టీ పేరు మార్చుకోమని సూచిస్తే మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌కు అభ్యంతరాలు వ్యక్తమైనందున ఇతర పేర్లను ప్రతిపాదించాలని సూచిస్తూ ఈ నెల 3వ తేదీన షర్మిలకు లేఖ రాసినట్లు మహబూబ్ బాషా దాఖలు చేసిన ఒక ఆర్టీఐ దరఖాస్తుకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేసింది. దీంతో షర్మిల వర్గానికి షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త పేరుతో మళ్లీ ప్రజల్లోకి వెళ్ళడం లేదా బాషా దాఖలు చేసిన అభ్యంతరాన్ని ఉపసంహరించుకునేలా షర్మిల చొరవ తీసుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన ప్రకటనలో ఎక్కడా వైఎస్ షర్మిల పేరు లేకపోవడం గమనార్హం. అనూహ్యంగా వైఎస్సార్ టీపీకి చైర్మన్ గా షర్మిల ప్రధాన అనుచరుడైన వాడుక రాజగోపాల్ పేరు ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. సుధీర్ కుమార్, ట్రజరర్ గా నూకల సురేశ్ పేర్లు ఉన్నాయి. వైఎస్సార్ టీపీ అనుమతులకు సంబందించిన పత్రాల్లో షర్మిల పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.

తెలుగు ప్రజల గుండెల్లో మహానేతగా గుర్తిండిపోయిన వైఎస్సార్ కు రాజకీయ వారసులుగా వచ్చిన కొడుకు జగన్ ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకోగా, కూతురు షర్మిల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయ వారసత్వాన్నైతే అందిపుచ్చుకున్నారుగానీ, సాంకేతికంగా పార్టీల పరంగా ఈ ఇద్దరూ తండ్రి పేరును పొందలేకపోయారు.

వైఎస్సార్ అనే అక్షరాలు కలిసొచ్చేలా జగన్.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెట్టుకోగా, షర్మిలకు వైఎస్సార్ పేరు నేరుగా దక్కినా, పార్టీకి ఆమె అధ్యక్షురాలిగా లేరు. ఇప్పటివరకు పార్టీయే రిజిస్టర్ కాలేదు. షర్మిల పార్టీని ఎన్నికల సంఘం రిజిస్టర్ చేయలేదని ప్రచారమైతే ఆమెను ఎవరు లెక్క చేస్తారు ?