ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్.. మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నాని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఓ కమిటీ వేశారు. అయితే ఈ కమిటీని తాము గుర్తించబోమని, అసలు కమిటీ వేసినట్టు అధికారిక సమాచారమేదీ లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
అంతేకాదు రోజంతా మంత్రులు సంప్రదింపుల కోసం వేచి చూసినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదు. జీఏడీ కార్యదర్శి ఫోన్ చేసిన తర్వాత కూడా తమది అధికారిక కమిటీ కాదని, సంప్రదింపులకు రాబోమని అనడం ఉద్యోగ సంఘాలకు సరికాదని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఉద్యోగ సంఘాల ప్రతినిధుల కోసం రేపు కూడా వేచి చుస్తామన్నారు కమిటీ సభ్యులు. వారు వస్తే చర్చలకు తాము సిద్ధమేనని చెప్పారు సజ్జల. ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమేనంటున్న ఆయన.. వారు ఎలాంటి సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చెప్పిందో ప్రజలకు వివరిస్తే తప్పెలా అవుతుందని, ఉన్నది ఉన్నట్టు చెబితే అది తప్పుడు ప్రచారం ఎందుకవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు, నిజంగా సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పారు.
క్రమశిక్షలో పెడతాం..
సమ్మె నోటీస్ ఇస్తే, కచ్చితంగా నోటీస్ పీరియడ్ లో పనిచేయాల్సి ఉంటుందని, అదే సమయంలో ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో సమ్మె నోటీస్ కి అర్థమేముంటుందని ప్రశ్నించారు సజ్జల. అదే జరిగితే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియ ప్రారంభించాల్సి వస్తుందని అన్నారు.
మొత్తమ్మీద రోజంతా ఉద్యోగుల కోసం వేచి చూసిన సజ్జల కమిటీ చివరకు క్రమశిక్షణ అనే పదం వాడాల్సి వచ్చింది. సమ్మెకు వెళ్లడం ఉద్యోగుల హక్కు అంటూనే.. క్రమశిక్షణలో పెట్టడం తమకు తెలుసంటూ పరోక్షంగా హెచ్చరికలు పంపించినట్టయింది. ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు తేలుతుందో చూడాలి.