పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టులో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నూతన పీఆర్సీతో తమ వేతనాలు తగ్గుతాయనేది ఉద్యోగుల ప్రధాన వాదన. అందుకే పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగుల తాజా డిమాండ్. కానీ పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం జీవోలు కూడా చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రెజరీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాము ఉద్యమ బాట పట్టామని, ఆదేశాలను మన్నించలేమని ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.
ఇదిలా వుండగా రెండు రోజుల క్రితం నూతన పీఆర్సీని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హైకోర్టులో పలు ఆసక్తికర, ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఉద్యోగుల జీతాలు తగ్గుతాయని న్యాయస్థానాన్ని ఆశ్రయించారో, ఆయన వేతనమే భారీ స్థాయిలో పెరిగినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది నిరూపించడం గమనార్హం.
ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య జనవరి నెల జీతం రూ.28 వేలు పెరిగినట్టు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయ వాది అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సదరు పిటిషనర్ వేతనానికి సంబంధించి గణాంకాలతో సహా కోర్టుకు అందజేశారు. దీనిపై పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించగా… తన జీతం పెరగడం నిజమే అని ఒప్పుకోవాల్సిన దుస్థితి కృష్ణయ్య ఏర్పడింది. అయితే హెచ్ఆర్ఏ తగ్గిందని పిటిషనర్ వాదించగా, వాటిని కోర్టు కొట్టిపడేసింది. మొత్తంలో జీతంలో పెరుగుదల ఉందా? లేదా? అని ప్రశ్నించగా …ఉందనే సమాధానం వచ్చింది.
దీంతో నూతన పీఆర్సీతో ఉద్యోగుల వేతనాల్లో కోత పడుతుందనే వాదనలో పసలేదని హైకోర్టు సాక్షిగా నిరూపితమైంది. కేవలం తాము డిమాండ్ చేసినట్టు జీతాలు పెరగలేదనే అక్కసుతో ప్రభుత్వాన్ని ఉద్యోగులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే విమర్శలకు ఇవాళ హైకోర్టులో కృష్ణయ్య వేతనం పెంపు ఉదంతం బలం కలిగిస్తోంది. కృష్ణయ్యకు రూ.28 వేల వేతనం పెరిగినప్పటికీ, కోర్టుకు ఆశ్రయించారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ మొత్తంలో జీతం పెరిగినా…కృష్ణయ్య లాంటి వాళ్లు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఉద్యమాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడాన్ని చూస్తూ ప్రజానీకం అవాక్కు అవుతోంది.