దేశంలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న కరోనా థర్డ్ వేవ్ వచ్చే నెల రెండో పక్షం తర్వాత తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాలను వేస్తోంది భారత ప్రభుత్వం. దేశంలో కరోనా పరిస్థితిపై విశ్లేషిస్తూ.. వచ్చే పదిహేను నుంచి ఈ వేవ్ తగ్గుముఖం పడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.
ఇప్పటి వరకూ కోవిడ్ డాటాలను విశ్లేషించడంలో అధ్యయన సంస్థలు, ఐఐటీలు బిజీగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇవి ఇస్తున్న సమాచారాన్ని విశ్లేషించుకుని ప్రస్తుత వేవ్ ఫిబ్రవరి పదిహేను తర్వాత తగ్గుముఖం పట్టవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. ప్రస్తుతం కేంద్రం లెక్కల ప్రకారమే.. యాక్టివ్ కేసుల సంఖ్య 22 లక్షలుగా ఉంది. అయితే.. ఈ వేవ్ అనధికారిక కేసుల సంఖ్య ఇంకా భారీగా ఉండవచ్చనే అంచనాలున్నాయి.
ఏదేమైనా అధికారిక కేసుల ప్రకారం చూసుకున్నా.. 22 లక్షలు భారీ నంబరే! రెండో వేవ్ లో పతాక స్థాయికి వెళ్లినప్పుడు యాభై లక్షల వరకూ యాక్టివ్ కేసులు వెళ్లినట్టున్నాయి. ఆ తర్వాత వేవ్ తగ్గుముఖం పట్టింది. మరి ఈ సారి పతాక స్థాయికి ఇంకా ఇరవై రోజుల వరకూ సమయం ఉందని కేంద్రం అంచనాలు వెలువరిస్తోంది.
ఇరవై రోజుల వరకూ కేసుల సంఖ్య పెరిగే అవకాశమే ఉంటుందనుకోవాలి. ఆ తర్వాత తగ్గుముఖం పట్లవచ్చు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలున్నాయి.